
పోలీసుల అదుపులో ముద్రగడ పద్మనాభం
అమలాపురం : కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు. దీంతో కాపు కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ముద్రగడను తరలిస్తున్న బస్సుకు అడ్డుగా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ముద్రగడను తీసుకువెళుతున్న వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాగా తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని వదిలిపెట్టాలంటూ ముద్రగడ పద్మనాభం ఈరోజు ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.