పోలీస్‌శాఖ వర్సెస్ రవాణా శాఖ
* అప్పుడు గప్‌చుప్... ఇప్పుడు వార్!
* నేరాన్ని సర్దుబాటు చేసి యుద్ధం
* దొంగ దొరకడంతో ఒకరిపై ఒకరు నెపం
గుంటూరు (నగరంపాలెం): ఆరునెలల క్రితం ఓ నేరం జరిగింది... దానిని రవాణా, పోలీస్ శాఖలు సర్దుబాటు చేశాయి... తాజాగా ఇందుకు కారణమైన నిందితుడు దొరికాడు... ఇప్పుడు పునర్విచారణ పేరుతో అరెస్టుల పర్వం మొదలైంది... అంతేకాక ఈ కేసు రవాణా, పోలీస్‌శాఖల నడుమ రగడకు దారితీస్తోంది.
గుంటూరుకు చెందిన యార్లగడ్డ నాగ చెతన్య తనకు తెలియకుండా తన వాహనంపై సంకూరి రవికిరణ్ అనే వ్యక్తి రూ.5.5 లక్షలు రుణం తీసుకున్నాడని, దీనిపై విచారించి బాధ్యులపై చర్య తీసుకోవాలని మార్చినెలలో ఉప రవాణా కమిషనరును కోరారు. దీనిపై విచారించిన రవాణాశాఖ అధికారులు పోలీసులు ఇచ్చిన మిస్సింగ్ సర్టిఫికెట్ ఆధారంగానే రవికిరణ్ నకిలీ ఆర్‌సీ పొందడంతో పొరపాటు జరిగిందని గ్రహించారు. కార్యాలయం వద్ద ఉన్న ఆర్‌టీఏ ఏజెంటు సహకారంతోనే రవికిరణ్ సులువుగా రుణం పొందినట్లు తెలిసింది. దీనిలో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు కూడా ఉండటంతో వాహనంపై ఉన్న రుణాన్ని సర్దుబాటు చేయటంతో పాటు వాహనాన్ని అసలు యజమానిపై మార్పు చేశారు. అయితే వారం క్రితం తాడేపల్లికి చెందిన రవికిరణ్ అనే వ్యక్తి ఆర్‌టీఏ కార్యాలయం వద్దకు రాగా కార్యాలయం ఉద్యోగులు గతంలో సంఘటనకు అతనే బాధ్యుడని జిల్లా ఉప రవాణా కమిషనరుకు అప్పగించారు. డీటీసీ సమాచారం మేరకు తాలుకా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిందితుని విచారించిన పోలీసులు కారు యజమానికి తెలియకుండానే రుణం పొందటానికి పూర్తి సహకారం రవాణాశాఖ అధికారులు కల్పించారని తేల్చారు. దీనికి బాధ్యులను చేస్తూ రవాణాశాఖ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందితో సహా పదిమందిని నిందితులుగా తేల్చారు.
పోలీసులదే తప్పంటున్న రవాణా శాఖ అధికారులు..
నిందితుడు నకిలీ ఆర్సీ పొందటానికి మిస్సింగ్ సర్టిఫికెట్ జారీ చేసిన పోలీసులదే తప్పు అని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. నిందితుడ్ని తమ అధికారులే పట్టిస్తే... తమ సిబ్బందిపై కేసులు నమోదు చేయటంపై రవాణా శాఖ కమిషనరు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విషయాన్ని డీజీ దృష్టికి తీసుకువెళ్లే యోచనలో రవాణాశాఖాధికారులు ఉన్నట్లు సమాచారం. మార్చిలో సంఘటనపై కేసు నమోదు చేయాలని కోరినా పోలీసులు ఒత్తిడితో కేసు రాజీ చేసి రుణం సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. కాగా, శుక్రవారం రవాణా శాఖకు చెందిన ఇరువురు ఉద్యోగులు కోర్టులో లొంగిపోయి బెయిల్ పొందటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రెండుశాఖల మధ్య చెలరేగిన ఈ సమస్య ఎక్కడికి వెళుతుందో చూడాల్సిందే.