
పోలీస్ వర్సెస్ దొంగ హైడ్రామా
► ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడు
► మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నం
► పోలీసులు, నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
► అరగంట సేపు జిల్లా కోర్టు సమీపంలో ట్రాఫిక్ జామ్
నెల్లూరు సిటీ : జిల్లా కోర్టు సమీపంలో సోమవారం పోలీస్ వర్సెస్ దొంగ హైడ్రామా నడిచింది. ఈ ఘటన కారణంగా దాదాపు అర్ధగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడని మరో నాన్‌బెయిల్‌బుల్ కేసులో మూడో నగర పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నిం చగా పోలీసులు, నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం, పెనుగులాట జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని కుక్కలగుంట ప్రాంతానికి చెందిన అరవ రమేష్ 2011లో ఓ చోరీ విషయలో నిందితుడు. అప్పటి నుంచి రమేష్ పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్నారు.
ఇతనిపై మూడో నగర పోలీసులు నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒకటోనగర పోలీస్‌స్టేషన్‌లోని ఓ పెండింగ్ కేసులో అరవ రమేష్ జిల్లా కోర్టుకు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడోనగర పోలీసులు కోర్టు నుంచి పాత జిల్లా జైలు మీదుగా వచ్చే రోడ్డు బయటకు వస్తుండగా రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితుడు రమేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితుడు పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో పోలీసులు, నింది తుడు, అతని కుటుంబ సభ్యుల మధ్య తోపులాట, పెనుగులాట జరిగింది. దాదాపు అరగంటకు పైగా ఈ హైడ్రామాతో ఆ ప్రాం తంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఓ దశలో ఉద్రిక్తత పరిస్థితి నెల కొంది. అయితే చివరికి పోలీసులు ఆటోలో రమేష్‌ను బలవంతం గా ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ రామారావు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.