
పకడ్బందీగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు
- మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు
- రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం
కర్నూలు (టౌన్) ; త్వరలో నిర్వహించనున్న కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు సూచించారు. స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల గుర్తింపు కార్యక్రమం ముగిసిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఇలా.. కులాల వారీగా ఓటర్లను కూడా గుర్తించామన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం, కర్నూలు, కల్లూరు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 13న కులాల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తామన్నారు.
ఒక్కో రిటర్నింగ్ అధికారి 5 వార్డులకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. 51 వార్డుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. 9వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలకు ఇబ్బందిగా ఉన్నట్లు గుర్తించామని, ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులకు వారికి కేటాయించిన కార్యాలయ గదిలో ఆయా వార్డుల సమాచారం, ఓటర్ల జాబితా తదితర వాటిని అప్పగిస్తామన్నారు. వారం రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ డిప్యూటి సిటీ ప్లానర్ కృష్ణకుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఇశ్రాయేలు, నగరపాలక మేనేజర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.