ఇఫ్తార్ విందులో రాజకీయ ప్రసంగం
- టీడీపీ అభ్యర్థికి సహకరించాలని కోరిన సీఎం
- ఫరూక్ విషయం పట్టించుకోని చంద్రబాబు
నంద్యాల: ముస్లింల పవిత్ర ఇఫ్తార్ విందును టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయం వేదికగా మార్చి.. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉపఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా అన్ని పార్టీలను ఒప్పిస్తున్నామని చెబుతూ, మరోవైపు పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఖరారు చేశామని, ముస్లింలు ఆయనకు సహకరించి ఆశీర్వదించాలని కోరారు. స్థానిక టెక్కె మార్కెట్‌యార్డులో రూ.1.27కోట్ల వ్యయంతో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని..ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నంద్యాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత తాను ముస్లింల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేశానని చెప్పారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మృతితో సీటు ఖాళీ అయ్యిందని, ఇంకా ఏడాదిన్నర కాలపరిమితి ఉన్నందున ఎన్నికలు జరుగుతాయన్నారు. మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబానికి సీటును ఏకగ్రీవంగా ఇవ్వాలనే సంప్రదాయం ఉందన్నారు. ఈ మేరకు భూమా కుటుంబానికి సీటు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశామని, ప్రధాన పక్షం నుంచి స్పందన రావాల్సి ఉందన్నారు. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ఖరారు చేశామని ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ ఎస్పీవైరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఆర్‌ఐసీ మాజీ చైర్మన్ ఏవీసుబ్బారెడ్డిలతో కూడా మాట్లాడామని చెప్పారు. ముస్లింలు భూమా కుటుంబానికి సహకరించాలని కోరారు.
పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న మాజీ మంత్రి ఫరూక్‌కు ఎమ్మెల్సీ సీటు, శాసన మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని ఆవాజ్ కమిటీ ప్రతినిధి అంజాద్‌బాషా కోరగా.. ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ప్రజలకు అభివాదం చేసి వెళ్లారు. ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాలను ప్రసాదిస్తారని ముస్లిం నేతలు ఆశించారు. కాని ఆయన ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను గురించి ప్రసంగించి వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇఫ్తార్ విందులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు, అఖిలప్రియ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎస్వీమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు.