కాలుష్యంతో మత్స్య సంపదకు ముప్పు
-
కోస్టుగార్డు కమాండెంట్ వేణుమాధవ్
-
కృష్ణపట్నం తీరంలో కోస్టల్ క్లీనప్ డే ప్రారంభం
ముత్తుకూరు : సముద్ర జలాల కాలుష్యంతో మత్స్యసంపదకు ముప్పు ఏర్పడుతుందని ఇండియన్ కోస్టు గార్డు కమాండింగ్ ఆఫీసర్ వేణుమాధవ్ పేర్కొన్నారు. కృష్ణపట్నం తీరంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్‌డేను శనివారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ‘స్వచ్ఛసాగర్ అభియాన్ దివాస్’గా ప్రకటించిందని గుర్తు చేశారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నాశనం కావని, మత్స్య సంపదకు ఆహారమైన ప్లాంటాన్ల ఉనికికే ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనంతో తీరం పొడవున్నా చెత్త పేరుకుపోయిందని విచారం వ్యక్తం చేశారు. సముద్రతీరం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముత్తుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆర్‌ఆర్ స్కూల్ విద్యార్థులు తీరంలోని చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఆరాధ్య భరద్వాజ్, పోర్టు మెరైన్ డీజీఎం షఫీ, ట్రీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సందీప్, తదితరులు పాల్గొన్నారు.