తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
– హాస్టల్ నిర్వాహకురాలి వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
తిరుపతి క్రైం: తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్‌ఐ మల్లికార్జున కథనం మేరకు... వైఎస్సార్ కడప జిల్లా పెనమూలు మండలం ఇండ్లూరి దళితవాడకు చెందిన బి.రవికుమార్, వెంకటసుబ్బమ్మ దంపతులకు కుమార్తె స్వాతి(16) తిరుపతిలోని కపిలతీర్థం రోడ్డులోని శ్రీనివాస మహిళా హాస్టల్‌లో ఉంటూ ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో వసతి గృహంలో శుక్రవారం జరిగిన చోరీ విషయాన్ని నిర్వాహకురాలు మాధవి ఫోన్‌లో స్వాతి తండ్రికి చెప్పింది. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసి ‘మీ కుమార్తె గదిలో ఆత్మహత్య చేసుకుంది’ అని వెల్లడించింది. హాస్టల్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని విచారణ చేశారు. వసతి గృహం నిర్వాహకురాలు తమ కుమార్తెపై దొంగతనం మోపి దుర్భాషలాడిందని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ కళాశాలకు తరలించారు.