తహసీల్దార్ కార్యాలయంలో బైఠాయించిన రైతులు
ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన
బలిజిపేట రూరల్: పెదంకలాం కాలువ సాగునీరు అందకపోవడంతో మండలలోని పెదపెంకి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ మేరకు ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఇరిగేషన్ ఏఈ వేణుగోపాలనాయుడు కార్యాలయం వద్ద లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడి ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పెదపెంకి గ్రామానికి పెదంకలాం కాలువ ద్వారా ఒకబొట్టు నీరయినా అందలేదని, మాభూముల సంగతేమిటని, మావద్ద శిస్తులు వసూలు చేస్తున్నారు, నాయకులు కాలువ పనులు చేసుకుని బిల్లులు తీసుకుంటున్నారు కానీ మాకు సాగునీరు అందడం లేదని రైతులు ఈర్ల సంజీవనాయుడు, జి.సూర్యనారాయణ, నాయుడుబాబు, కండినథానీలు, జి.రాంబాబు, రామారావు, ఎన్.ఈశ్వరరావు, డి.మురళీధర్, జగన్నాథంనాయుడు తదితరులు ఆందోళన చేశారు.
నీరివ్వకుండా ప్రారంభాలెందుకు?
కాలువ దిగువన సుమారు 1000ఎకరాల భూమి
పెదపెంకి గ్రామానికి చెందినది ఉందని దానికి చుక్కనీరయినా అందడంలేదని వాపోయారు. కాలువ నుంచి అక్రమంగా సాగునీరు తరలిస్తున్నా ఇరిగేషన్ అదికారులు, సిబ్బంది, ప్రాజెక్టు చైర్మెన్, టీసీలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఈమాత్రం దానికి పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీజగదీష్‌లు పెదంకలాం హెడ్‌వద్ద నెలరోజుల క్రితం నీరు విడుదల చేయడం ఎందుకని రైతులు ప్రశ్నించారు. నీరు అందించకపోతే భవిషత్‌లో తీవ్ర అందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు ఆందోళస సమచారం తెలసుకునన్న తహసీల్దార్ బీవీ లక్ష్మి వారితో ఫోన్‌లో మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా సాగునీరు తరలిస్తే అటువంటి వారిపై చర్యలు చేపడతామని తెలియపరిచారు. కార్యక్రమంలో పెదపెంకి రైతులతో పాటు సీపీఎం నాయకులు వంజరాపు సత్యంనాయుడు, యమ్మల మన్మథరావు పాల్గొన్నారు.