పేదల బతుకు బుగ్గి | Poor survival dust | Sakshi
Sakshi News home page

పేదల బతుకు బుగ్గి

Published Fri, Dec 9 2016 12:44 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

పేదల బతుకు బుగ్గి - Sakshi

పేదల బతుకు బుగ్గి

- అగ్నిప్రమాదంలో 18 గుడిసెలు దగ్ధం 
- రూ. లక్షల్లో నష్టం 
- కట్టుబట్టలతో మిగిలిన బాధితులు 
  
 
నంద్యాల: 
నంద్యాల పట్టణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రలో ఉండగా చెలరేగిన మంటల నుంచి ప్రాణాలు రక్షించుకున్న పేదలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. స్థానిక రాణి, మహారాణి థియేటర్‌ సమీపంలో ఏడు సెంట్ల స్థలంలో పేదలు రెండు వైపులా 9 చొప్పున మొత్తం 18 గుడిసెలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరంతా పొలాల్లో, కూలీ పని చేసి జీవించేవారే. చలి కావడంతో అందరూ గుడిసెల్లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మొదట లక్ష్మీదేవి గుడిసెలో షార్ట్‌ సరూ​‍్క్యట్‌ కారణంగా నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. వీరు కేకలు వేయడంతో మిగతా గుడిసెల వారు అప్రమత్తమయ్యారు. అయితే సమయంలో గాలులు వీయడంతో మంటలు అన్ని గుడిసెలకు వ్యాపించాయి. దీంతో పేదలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, రోడ్డుపైకి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కేవలం అరగంటలో గుడిసెలన్ని బూడిదయ్యాయి. గుడిసెల్లోని బీరువాలు, వంట సామగ్రి, దుస్తులు, తిండిగింజలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ముగ్గురు విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు కాలిపోయాయి.  18 కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. 
 
బాధితులకు రూ.లక్ష ఆర్థిక సహాయం:
అగ్ని ప్రమాదం గురించి తెలియగానే వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం వారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి పక్కా ఇళ్లు ఇవ్వకుండా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇవ్వడంతో ఇంకా పేదలు గుడిసెల్లో నివసిస్తున్నారని చెప్పారు. బాధితులకు పక్కా ఇళ్లను నిర్మించాలని కోరారు. ఆయన వెంట 37వ వార్డు ఇన్‌చార్జ్‌ యూసుఫ్, అబ్దుల్లా, మల్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 
 
బా«ధితులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ...
ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి బాధితులను పరామర్శించారు. లయన్స్‌ సేవా ప్రగతి కార్యదర్శి శివశంకర్‌ ఆధ్వర్యంలో బాధితులకు బియ్యం ప్యాకెట్లను, దుప్పట్లను అందజేసి భోజన వసతిని కల్పించారు. వైఎస్‌నగర్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లలోకి మార్చాలని, వీరికి పక్కా ఇళ్లను అందజేస్తామని ఆయన చెప్పారు. తహసీల్దార్‌ శివరామిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు బియ్యం, రూ.5వేల ఆర్థికసహాయాన్ని అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు శేఖర్, వరప్రసాద్, దేవేంద్రనాథరెడ్డి, భాస్కరరెడ్డి, ఏవీఆర్‌ ప్రసాద్, డాక్టర్‌ రవికృష్ణ, జీవీఎల్‌ నారాయణ పాల్గొన్నారు.  
 
కట్టుబట్టలతో మిగిలిపోయాం: సంజమ్మ, బాధితురాలు:
అగ్ని ప్రమాదంలో అందరూ సర్వనాశనమయ్యారు. తిండి గింజలు, వంట పాత్రలు సహ అన్ని దగ్ధమయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిపోయాం. ఏం చేయాలో, ఏం తినాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, నేతలు ఆదుకోవాలి.
      
జీవనాధారం పాడైపోయింది: మద్దిలేటి, రజకుడు  
రోజూ తోపుడు బండిపై ఇస్త్రీ చేస్తూ జీవనం సాగించే వాడిని. కాని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉన్న నా తోపుడు బండి పాక్షికంగా దగ్ధమైంది. మంటలు ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది దీనిపైకి ఎక్కడంతో కుంగిపోయింది. నా జీవనాధారాన్ని కోల్పోయాను.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement