- వారం రోజుల్లో భూసమీకరణ నోటిఫికేషన్
- 20 వేల ఎకరాల భూసమీకరణకు రంగం సిద్ధం
- భూసేకరణ గడువు పెంపులో ఉద్దేశమేమిటో
మచిలీపట్నం(కృష్ణా జిల్లా)
బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్ గడువును 12 నెలలపాటు పెంచుతూ కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఆగస్టు 29వ తేదీన 14,427 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని గడువు ఆగస్టు 29వ తేదీతో ముగియనుండటంతో పునరుద్ధరిస్తూ మరో నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి కోసం మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282 ఎకరాలను కేటాయించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం 12,144 ఎకరాలను భూసేకరణ నోటిఫికేషన్‌లో చేర్చారు. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌నే మళ్లీ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.
వారం రోజుల్లో భూసమీకరణ నోటిఫికేషన్
గత ఏడాది ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయడంతో రైతులు తమ భూములను ఇచ్చేది లేదని ఆర్డీవో కార్యాలయంలో 4,800కు పైగా అభ్యంతరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్‌ను పక్కనపెట్టి భూసమీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటు చేశారు. ఎంఏడీఏ పరిపాలనా సౌలభ్యం కోసం వైస్‌చైర్మన్‌ను, 16 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమించారు. వీరిలో ఏడుగురు డెప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరారు. ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ చేస్తామని పాలకులు ప్రకటించారు. పుష్కరాలకు ముందే భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికారులు చెప్పారు. వివిధ కారణాలతో భూసమీకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా జాప్యం చేశారు.
సోమవారం మీకోసంలో జేసీ గంధం చంద్రుడు వారం రోజుల వ్యవధిలో భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భూసేకరణ నోటిఫికేషన్ మరో ఏడాది పాటు గడువును పెంచి భూసమీకరణ ద్వారా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం గమనార్హం. భూసమీకరణ ద్వారా ప్రైవేటు ల్యాండ్ 14వేల ఎకరాలు, అసైన్డ్‌భూమి 8వేల ఎకరాలు సమీకరిస్తారని విశ్వసనీయ సమాచారం. రైతులు అంగీకారపత్రం ఇవ్వకుండా సెంటుభూమి కూడా సమీకరించడానికి అవకాశం లేదని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. భూసమీకరణ ద్వారా భూమిని సేకరిస్తే ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత పోర్టు నిర్మాణం జరిగే మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282 ఎకరాలను సేకరిస్తారని గతంలో ప్రకటించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని మార్చి 22వేల ఎకరాల వరకు భూసమీకరణ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
2004లోనే పోర్టు నిర్మాణానికి 6,300ల ఎకరాలకు పైగా భూమిని ఇచ్చేందుకు మేటాస్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 5,324 ఎకరాలను పోర్టు నిర్మాణం కోసం సేకరించేందుకు జీవో నెంబరు 11ను జారీ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం భూసమీకరణకు ముందడుగు వేయటం వివాదాస్పదమవుతోంది. గత ఏడాది జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను, భూసమీకరణ అంశాన్ని ఒకేసారి తెరపైకి తేవడం రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.