పోరు ఆగదు
పోరు ఆగదు
Published Sun, Dec 18 2016 10:35 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
ఆకలికేకలతో హోరెత్తిన జిల్లా
మిన్నంటిన నిరసనలు
కాపులు కదం తొక్కారు. ఆదివారం ఆకలికేకలు కార్యక్రమంతో జిల్లాను హోరెత్తించారు. కంచాలపై గరిటెలతో మోగిస్తూ.. మానవహారాలు నిర్వహించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం/తణుకు : రిజర్వేషన్లు సాధించేవరకూ కాపుల ఆకలి పోరు ఆగదని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ఆయన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కాపులు ఆకలికేకలు కార్యక్రమం నిర్వహించారు. అన్ని మండలాల్లో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీసు ఐలాండ్ సెంటర్‌లో జరిగిన కాపుల ఆకలికేకలు కార్యక్రమంలో ముద్రగడ సతీసమేతంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు. గాంధేయమార్గంలోనే రిజర్వేషన్లు సాధిద్దామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేక ఇప్పటికే కాపులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, నిజాం పాలనలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని గుర్తుచేశారు. మండల కమిషన్ కూడా కాపులకు రిజర్వేషన్లు అవసరమని నివేదికలు ఇచ్చిందని, దామోదరం సంజీవయ్య హయాంలో ఆరేళ్లపాటు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్లతో కాలయాపన చేయొద్దని, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కంచంపై గరిటెల శబ్దం చేసి నిద్రలేపాలని పిలుపునిచ్చారు. ముద్రగడ గాంధీ మార్గంలో పాదయాత్ర ప్రారంభిస్తే నిరంకుశవైఖరితో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, అధికారం చేపట్టాక కాపులను మోసం చేసిందని విమర్శించారు. కాపు ఉద్యమాన్ని నీరు కార్చాలని, ఉద్యమానికి తూట్లు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆవేదన చెందారు. ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్లు సాధించడం ఖాయమన్నారు. అన్ని విధాలుగా ముద్రగడకు మద్దతు నిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు మాకా శ్రీనివాసరావు, ఈతకోట తాతాజీ. నరిశే సోమేశ్వరరావు, గుండుమోగుల నాగు, ఆకుల ధనశేఖర్ , మారిశెట్టి అజయ్, యెరుబండి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వలవల బాబ్జీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి అబ్బులు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, కాంగ్రెసు నాయకులు దుర్గా రామచంద్రరావు, కాపునాడు జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మాలమహానాడు, మైనార్టీ అసోసియేషన్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ముద్రగడకు ఘనస్వాగతం
అంతకుముందు ముద్రగడ పద్మనాభానికి 16వ జాతీయ రహదారి పొడవునా కాపులు పెద్దసంఖ్యలో మోటారు సైకిళ్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం చేరుకున్న అనంతరం ఆయన అంబేడ్కర్, శ్రీకృష్ణ దేవరాయలు, ఈలి ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటుగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ రాకకు ముందు టీబీఆర్ సైనిక స్కూలు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆలరించాయి. గుర్రాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
Advertisement
Advertisement