యాదాద్రిలో పనుల నత్తనడక
సాక్షి, యాదాద్రి: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా తయారైంది యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనుల ప్రగతి. యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని ప్రపంచస్థాయి దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం కొండపైన శనివారం ప్రారంభం కావాల్సిన ప్రధానాలయం గోపుర నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి.
కూల్చివేతలు పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. పనులను వేగవంతం చేయాలని గత నెల 19న సీఎం యూదాద్రికి వచ్చినప్పుడు అధికారులను ఆదేశించారు. అయినా పనుల్లో వేగం పుంజుకోలేదు. కొం డపై 2.33 ఎకరాల్లో ప్రధానాలయం నిర్మాణాల కోసం చేపట్టిన కూల్చివేతలు ఇంకా పూర్తి కాలేదు. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం నెలరోజుల క్రితమే కూల్చివేతలు మొత్తం పూర్తి కావాలి. గోపురాలు, శిల్పాల పనులను మొదలుపెట్టాలి. ఇందుకోసం తెచ్చిన రాతి స్తంభాలు కొండపై సిద్ధంగా ఉంచారు. కానీ, ఆయూ పనులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
ఒక్కటీ పూర్తి కాలేదు
4 రాజగోపురాలకుగాను ఒక్కటి కూడా పూర్తి కాలేదు. దక్షిణం వైపు లోతైన ప్రాంతం నుం చి నిర్మించాల్సి ఉంది. మిగతావి కొండపైనే నిర్మిస్తున్నా అవి నత్తనడకనే సాగుతున్నా యి. ముందుగా ప్రారంభించిన రిటైనింగ్ వాల్ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి.
వారం గడువు ఇచ్చిన అధికారులు
ప్రధానాలయ మండపం కూల్చివేతలు ఇప్పటికే పూర్తికావాలి. రెండు ప్రాకారాలు, ఆరు గోపురాలు, స్వర్ణతాపడంతో కూడిన విమాన గోపురం నిర్మించాల్సి ఉంది. కొండపైన ఇతర నిర్మాణాల కూల్చివేత పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మోహన్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.