కమీషన్ పేరుతో దోపిడీ
ప్రైవేటు కరెంటు బిల్లు వసూలు కేంద్రాలకు అయాచిత లబ్ధి
విజయవాడ :
ఏపీఎస్‌పీడీసీఎల్ సంస్థ విద్యుత్ బిల్లులు వసూలు చేసే కేంద్రాలను ప్రవేటు వ్యక్తులకు దశలవారీగా అప్పగిస్తోంది. విద్యుత్‌శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీపీ (ఎనీటైం మనీ పేమెంట్) కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఏటీపీ కేంద్రాలల నిర్వహకులకు అధిక కమీషన్ చెల్లించటం వల్ల ఏపీఎస్‌పీyీ సీఎల్‌కు తీవ్ర నష్టం వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న మీసేవా కేంద్రాలకు చెల్లించే రేటు కంటే ఇది అధికం. మీసేవా కేంద్రాలకు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రస్తుతం ఒక్కో బిల్లుకు రూ. 2.50 ఇస్తుండగా ఏటీపీ కేంద్రాలకు ఒకో బిల్లుకు రూ. 8.50 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో మూడు ఏటీపీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా నెలకు 32వేల బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో సెంటర్‌కు నెలకు రూ. 90 వేలు చొప్పున మూడింటికి కలిపి నెలకు రూ. 2.70లక్షలు చెల్లిస్తోంది. అదే మాన్యువల్ విధానంలో బిల్లు కలెక్టర్లకు ఒకో బిల్లుకు రూ. 2.50 చొప్పున చెల్లిస్తోంది.
ఈ క్రమంలో మూడు ఏటీపీ కేంద్రాలకు 32వేల బిల్లులకు రూ. 2.70లక్షలు చెల్లిస్తుండగా, బిల్లు కలెక్టర్లు, మీసేవా కేంద్రాల ద్వారా వసూలు చేస్తే కేవలం రూ. 80వేలు మాత్రమే సంస్థకు ఖర్చవుతుంది.
మరో 16 కేంద్రాలకు రంగం సిద్ధం
రానున్న కొద్ది రోజుల్లో నగరంలో మరో 16 కేంద్రాలను ఏర్పాటు చేయటనాకి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ 16 కేంద్రాల ద్వారా ఒక నెలకు రూ. 14.40లక్షలు ఖర్చువుతుండగా, ఏడాదికి 1.73 కోట్లు ఖర్చు చేస్తారని అంచనా. ఒకో కేంద్రానికి నెలకు రూ. 90వేలు చెల్లించేలా ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది మాసాల క్రితం దక్షణ మండల విద్యుత్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు వసూలు కు ఏటిపీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా సంస్థలో ఉన్నతాధికారులు ఓ ప్రవేటు సంస్థకు ఏటీపీ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా కట్టబెట్టారు. వినియోగదారులకు సేవలు ఎలా ఉన్నా విద్యుత్ సంస్థకు నష్టం వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. తద్వారా భవిష్యత్తులో ఈ భారం వినియెగదారులపై పడుతుందని ఏపీఎస్‌పీడీసీఎల్ సిబ్బంది చెపుతున్నారు.
పెద్దల ప్రమేయం?
ఈ వ్యవహారం వెనుక కొందరు పెద్దతలకాలయ పాత్ర ఉందని, వాటాలు, మామూళ్ల కోసమే ఈ దందాకు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.