- భారీగా పెరిగిన విద్యుత్తు వినియోగం
- అధికమైన లో వోల్టేజీ సమస్య
- ట్రిప్ అవుతున్న ఫీడర్లు
- ఈదురు గాలులకు పడిపోతున్న స్తంభాలు
- రూరల్‌లో సరఫరా పురనరుద్ధరణకు అధిక సమయం
- సెక్షన్ ఆఫీస్, హెల్‌్ప డెస్క్‌లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు .
అంతరాయాల చింతలు
Published Fri, May 19 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
సాక్షి, రాజమహేంద్రవరం:
ఉష్ణోగ్రత పెరిగి వేడిని తట్టుకోలేక వినియోగం పెరగడంతో జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు అధికమయ్యాయి. వీటికితోడు ఈదురు గాలులు తోడై వర్షాలకు ఒరిగిన స్తంభాలు, తెగిపడిన విద్యుత్తు తీగలు ...విద్యుత్తు శాఖ సిబ్బందికి పని భారం పెరగడంతో సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించలేకపోతున్నారు. ఫలితంగా ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క విద్యుత్ అంతరాయాలు, మరో పక్క వేసవి ఉక్కపోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడక్కడా జనం ఆందోళనలకు దిగుతుండడంతో సిబ్బందిలో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి.
.
లో వోల్టేజీలతో ఉక్కిరిబిక్కిరి...
వేసవి ఉపసమనం కోసం ఏసీలు, కూలర్లు విరివిగా ఉపయోగిస్తుండడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువై సంబంధిత సెక్షన్ ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య తీవ్రమైంది. గత నాలుగు రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సమస్య తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు విద్యుత్తు కోతలు అధికంగా ఉంటున్నాయి. బుధవారం జిల్లాలో 693 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే గురువారం 705 (ఒక మెగావాట్= 10 లక్షల యూనిట్లు) మెగావాట్లకు చేరింది. ఒక్క రోజులోనే 12 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 18వ తేదీన 14.85 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్ వినియోగం అధికమవడంతో ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. తిరిగి పునరుద్ధరించడానికి సిబ్బందికి ఎక్కువ సమయం పడుతోంది.
.
మోత మోగుతున్న సెక‌్షన్ ఆఫీసుల ఫోన్లు...
ఎడా పెడా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండడంతో సెక‌్షన్ ఆఫీసులు, ఏపీఈపీడీసీఎల్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 84 సెక్షన్‌ల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. వ్యక్తిగత కనెక్షన్లకు, టోటల్ గ్రూపులకు లోవోల్టేజీ సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో ఒక్కొక్క సెక్షన్ కార్యాలయానికి రోజుకు దాదాపు 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ లెక్కన రోజకు జిల్లాలోని 84 సెక్షన్ కార్యాలయాలకు దాదాపు వెయ్యి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవిగాక విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ హెల్ఫ్‌డెస్క్‌కు వచ్చే ఫిర్యాదులు అదనం. జిల్లా నుంచి సోమవారం 390, మంగళవారం 526, బుధవారం 811, గురువారం 650 ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో లోవోల్టేజ్, సరఫరాకు అంతరాయాలు వంటి ఫిర్యాదులే 90 శాతం ఉన్నాయని చెబుతున్నారు.
.
ఉరుకులు పరుగుల తీస్తున్న సిబ్బంది...
ఈదురుగాలల వల్ల పడిపోయిన స్తంభాలు, తెగిన విద్యుత్ వైర్లను తిరిగి పునరుద్ధరించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టణాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను 12 గంటలలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. పని భారం పెరగడం, ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో నిర్ణీత సమయానికి ఫిర్యాదులను పరిష్కరించలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం సాయంత్రం ఆరుగంటల తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది తీసుకోకపోవడంతో ప్రజలు తమ సమస్య పరిష్కారం కోసం మరుసటి రోజు వరకు వేచిచూడాల్సి వస్తోంది.
–––––––––––––––––––
సరఫరా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈదురుగాలల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కూలిన స్తంభాలు, విద్యుత్తు తీగలను త్వరితగతిన తిరిగి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేసవిలో ఇప్పటి వరకు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఏసీల వినియోగం, లోడు ఎక్కువ కావడంతో సరఫరాలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. పట్టణాలలో పెద్దగా అంతరాయాలు లేవు. గ్రామీణ ప్రాంతాల పరిధి ఎక్కువగా ఉండడంతో సమస్యను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతోంది.
– వై.ఎస్.ఎన్.ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్, తూర్పుగోదావరి.
Advertisement