powercut
-
కొనడానికి లేదు.. తినడానికి లేదు
ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్ కింద కునుకు తీద్దామంటే కరెంట్ ఉండదు. ఏం చేయాలి? ఎలా బతకాలి? అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు. అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు. కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుద్దామంటే కరెంట్ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్ పెట్రోల్ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్ రూ.250, అయిదు కేజీల గ్యాస్ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు. పాల పౌడర్ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు. 2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ? పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో డాలర్ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశంలో విద్యుత్ కష్టాలు పోవాలంటే..ఈ పనిచేయాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ కష్టాలు ప్రత్యేకించి వేసవి కాలంలో తొలగిపోవాలంటే బొగ్గు సుంకం రహిత దిగుమతికి అనుమతించాలని పారిశ్రామిక సంస్థ– అసోచామ్ స్పష్టం చేసింది. దీనితోపాటు బొగ్గు రవాణా చేయడానికి రైల్వే రేక్‌ల లభ్యత భారీగా పెరగాలని, క్యాప్టివ్ జనరేటర్లకు డీజిల్ వేర్వేరు ధరలకు లభ్యమయ్యేలా చూడాలని కోరింది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు... ► విద్యుత్ సరఫరాలో వాణిజ్య వినియోగదారులతో విభేదాలు లేకుండా చూసుకోవాలని మేము రాష్ట్రాలు, డిస్కమ్‌లను కోరతాము. ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం ఆర్థిక పునరుద్ధరణ ఉన్నప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది. ► ప్రపంచ సరఫరా పరిమితులు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు, డిస్కమ్‌లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ►ప్రస్తుతం బొగ్గుపై దిగుమతి సుంకం 2.5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సుంకాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ►భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి ప్రధానంగా బొగ్గు దిగుమతి అవుతోంది. ఇటీవల ఆ దేశంతో భారత్‌కు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశ మధ్య, దీర్ఘకాలిక బొగ్గు సరఫరాల సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. తగిన బొగ్గు సరఫరాలు దేశంలో సకాలంలో అందేలా చర్యలు అవసరం. ►అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే అదనపు సాధారణ హీట్‌వేవ్ వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ►వర్షాలకు ఇంకా చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రాలు, పరిశ్రమలు సంయుక్తంగా నిరంతరం పర్యవేక్షణతో పరిస్థితిని నిర్వహించాల్సిన ఉంటుంది. ►ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై అసోచామ్ ఇప్పటికే సభ్యులపై సంప్రతింపులు జరిపింది. ఆయా అంశాలను ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. ►డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్రం ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ►ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేవలం దృష్టి సారిస్తే సరిపోదు. పంపిణీకి సంబంధించి కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర, రాష్ట్రాలు పరిష్కరించాలి. అయితే, కేంద్రం ఈ దిశలో అనేక చర్యలతో ముందుకు వస్తోంది. వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాష్ట్రాల సహకారం కూడా అవసరం. ఇప్పటికే ప్రధానికి వినతులు... పరిశ్రమ బొగ్గు కొరత సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్సే్చంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు, 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి సంయుక్తంగా ఒక వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. -
మేమేం చేశాం నేరం..!
సాక్షి, మద్నూర్(కామారెడ్డి) : గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మేం ఏం తప్పు చేశామని అధికారులు మాకు ఈ శిక్ష వేస్తున్నారు.. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల నుంచి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదని, దీంతో తాగునీటికి తంటాలు పడుతున్నామని వారు వాపోయారు. గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆది, సోమవారం రెండు రోజులుగా నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బందిపై ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దాడి చేస్తే పూర్తిగా ఊరందరికి శిక్ష ఎందుకు వేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులపై దాడి చేసిన ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, కాని ఉళ్లో ఉన్న అందరి ఇళ్లకు కరెంట్ నిలిపివేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీరు దొరకడం లేదని వారు వాపోయారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు వద్ద నుంచి తాగునీటిని తెచుకోవాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. చీకట్లో ఆరుబయట నిద్రిస్తున్న ప్రజలు ఫోన్లన్నీ స్విచ్ఆఫ్లోనే.. రెండు రోజులుగా గ్రామానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఊర్లో ఉన్న ఫోన్లన్నీ స్వీచ్ఆఫ్లోనే ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్లు చేయాల్సి వస్తే పక్క గ్రామాలకు వెళ్లి ఫో న్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయా రు. రాత్రి సమయాల్లో ఉక్కపోత మరోవైపు దోమలతో జాగారం చేయాల్సివస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఫ్యాన్లు తిరగనిదే పడుకోవడం లేదని తెలిపారు. ఆరుబయట నిద్రి ద్దామంటే వర్షపు చినుకులు పడుకోనివ్వడం లేద ని చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మద్నూర్ ట్రాన్స్‌కో ఏఈ అరవింద్ ను సంప్రదించగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. రెండు రోజులుగా కరెంట్ కట్ రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లకు వెళ్లాల్సి వస్తోంది. వేసవికాలంలో కూడా వ్యవసాయ బోరు వద్దకు వెళ్లలేదని, కానీ ఇప్పుడు వెళ్లాల్సి వస్తోంది. వారు చేసిన తప్పుకు శిక్ష మేం అనుభవించడం న్యాయమా..? –గంగారాం పటేల్, గ్రామస్తుడు, సోమూర్ తాగునీటికి ఇబ్బందులు 48 గంటలుగా మా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. సెల్ఫోన్లు అన్ని స్విచ్ఆఫ్ అయ్యాయి. చిన్న చిన్న వ్యాపారులు కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. –ఆనంద్, సోమూర్ -
అంతరాయాల చింతలు
భారీగా పెరిగిన విద్యుత్తు వినియోగం అధికమైన లో వోల్టేజీ సమస్య ట్రిప్ అవుతున్న ఫీడర్లు ఈదురు గాలులకు పడిపోతున్న స్తంభాలు రూరల్‌లో సరఫరా పురనరుద్ధరణకు అధిక సమయం సెక్షన్ ఆఫీస్, హెల్్ప డెస్క్‌లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు . సాక్షి, రాజమహేంద్రవరం: ఉష్ణోగ్రత పెరిగి వేడిని తట్టుకోలేక వినియోగం పెరగడంతో జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు అధికమయ్యాయి. వీటికితోడు ఈదురు గాలులు తోడై వర్షాలకు ఒరిగిన స్తంభాలు, తెగిపడిన విద్యుత్తు తీగలు ...విద్యుత్తు శాఖ సిబ్బందికి పని భారం పెరగడంతో సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించలేకపోతున్నారు. ఫలితంగా ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క విద్యుత్ అంతరాయాలు, మరో పక్క వేసవి ఉక్కపోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడక్కడా జనం ఆందోళనలకు దిగుతుండడంతో సిబ్బందిలో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి. . లో వోల్టేజీలతో ఉక్కిరిబిక్కిరి... వేసవి ఉపసమనం కోసం ఏసీలు, కూలర్లు విరివిగా ఉపయోగిస్తుండడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువై సంబంధిత సెక్షన్ ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య తీవ్రమైంది. గత నాలుగు రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సమస్య తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు విద్యుత్తు కోతలు అధికంగా ఉంటున్నాయి. బుధవారం జిల్లాలో 693 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే గురువారం 705 (ఒక మెగావాట్= 10 లక్షల యూనిట్లు) మెగావాట్లకు చేరింది. ఒక్క రోజులోనే 12 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 18వ తేదీన 14.85 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్ వినియోగం అధికమవడంతో ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. తిరిగి పునరుద్ధరించడానికి సిబ్బందికి ఎక్కువ సమయం పడుతోంది. . మోత మోగుతున్న సెక్షన్ ఆఫీసుల ఫోన్లు... ఎడా పెడా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండడంతో సెక్షన్ ఆఫీసులు, ఏపీఈపీడీసీఎల్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 84 సెక్షన్ల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. వ్యక్తిగత కనెక్షన్లకు, టోటల్ గ్రూపులకు లోవోల్టేజీ సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో ఒక్కొక్క సెక్షన్ కార్యాలయానికి రోజుకు దాదాపు 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ లెక్కన రోజకు జిల్లాలోని 84 సెక్షన్ కార్యాలయాలకు దాదాపు వెయ్యి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవిగాక విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ హెల్ఫ్డెస్క్కు వచ్చే ఫిర్యాదులు అదనం. జిల్లా నుంచి సోమవారం 390, మంగళవారం 526, బుధవారం 811, గురువారం 650 ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో లోవోల్టేజ్, సరఫరాకు అంతరాయాలు వంటి ఫిర్యాదులే 90 శాతం ఉన్నాయని చెబుతున్నారు. . ఉరుకులు పరుగుల తీస్తున్న సిబ్బంది... ఈదురుగాలల వల్ల పడిపోయిన స్తంభాలు, తెగిన విద్యుత్ వైర్లను తిరిగి పునరుద్ధరించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టణాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను 12 గంటలలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. పని భారం పెరగడం, ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో నిర్ణీత సమయానికి ఫిర్యాదులను పరిష్కరించలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం సాయంత్రం ఆరుగంటల తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది తీసుకోకపోవడంతో ప్రజలు తమ సమస్య పరిష్కారం కోసం మరుసటి రోజు వరకు వేచిచూడాల్సి వస్తోంది. ––––––––––––––––––– సరఫరా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈదురుగాలల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కూలిన స్తంభాలు, విద్యుత్తు తీగలను త్వరితగతిన తిరిగి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేసవిలో ఇప్పటి వరకు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఏసీల వినియోగం, లోడు ఎక్కువ కావడంతో సరఫరాలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. పట్టణాలలో పెద్దగా అంతరాయాలు లేవు. గ్రామీణ ప్రాంతాల పరిధి ఎక్కువగా ఉండడంతో సమస్యను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. – వై.ఎస్.ఎన్.ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్, తూర్పుగోదావరి. -
కరెంటు లేకుంటే కాపురానికి రానే రాను...
పాట్నా: అత్తింటి ఆరళ్లకు తాళలేక మెట్టినిల్లు విడిచిపెట్టి పుట్టింటికి వచ్చే కోడళ్లను చూశాం. సులభ్ శానిటేషన్ చేపట్టిన సామాజిక ఉద్యమం కారణంగా మరుగు దొడ్లను నిర్మిస్తేగానీ అత్తింటిలో అడుగుపెట్టమంటూ శపథం చేస్తున్న నవతరం కోడళ్లను చూస్తున్నాం. కరెంటు కోతలున్నంతకాలం అత్తింటిలో అడుగుపెట్టనంటూ మొండికేసిన ఓ కోడలి ఉదంతాన్ని మొదటిసారి వింటున్నాం. దళిత యువతి రేణు పాశ్వాన్ మూడేళ్ల కింద పాట్నా జిల్లాలోని బార్ని గ్రామానికి చెందిన శశిభూషణ్ పాశ్వాన్‌ను పెళ్లి చేసుకొంది. ఎన్నో ఆశల పల్లకిలో అత్తింట్లో అడుగుపెట్టింది. పుట్టింట్లో పంకా గాలి కింద పడుకునే అలవాటున్న రేణుకు కరెంటు కోత ఎక్కువగా ఉన్న అత్తింట్లో ఉక్కపోతకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు పుట్టింటికి పారిపోదామా అని చూస్తున్న ఆమె తొలిచూలు పేరుమీద పుట్టింటికి వెళ్లింది. కొడుకు పుట్టాక కూడా అత్తింటికి రావడానికి నిరాకరించింది. భర్త, బంధువులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు. దాదాపు రోజుకు పది గంటల కరెంటు కోత ఉండే ఆ ఊళ్లో ఒక్కరోజు కూడా తాను ఉండలేనని చెప్పింది. పైగా అత్తింటికి సమీపంలోనే కోళ్ల ఫారం ఉందని, పరిసర ప్రాంతాలు అనారోగ్యకరంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో తానుండడం, తన కొడుకును పెంచడం కుదరనే కుదరని మొండికేసింది. తొలి కానుపు బిడ్డ ఫంక్షన్ అత్తింట్లో జరుపుకోవడం ఆచారమంటూ బతిలాడి బామాలి రేణును అత్తింటి వాళ్లు తీసుకెళ్లారు. ఫంక్షన్ స్తోమతమేరకు ఘనంగానే జరిపారు. భార్యాభర్తలు కూడా ఆనందంగానే గడిపారు. ఫంక్షన్‌కు సంబంధించిన కార్యక్రమాలు ముగియగానే రేణు తన కొడుకుతోసహా పుట్టింటికి తిరిగి చెక్కేసింది. ఈ విషయమై గత గురువారం ఇరు కుటుంబాల మధ్య మళ్లీ గొడవైంది. ఇక ఆమెకు నచ్చచెప్పడం సాధ్యంకాదని భావించిన భర్త శశిభూషణ్ సమీపంలోని ధనుర్వా పోలీసు స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్యాభర్తలు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి వాదనలు విన్నారు. సార్! ఒకప్పుడు మా ఊళ్లో కరెంటు ఎప్పుడొచ్చేదో, పోయేదో ఎవరికి తెలిసేది కాదు. ఇటీవలి కాలంలో కరెంటు పరిస్థితి బాగా మెరుగుపడింది. ఇప్పుడు పది, పదకొండు గంటలకు మించి కరెంటు పోవడం లేదు. రేణు తల్లిదండ్రులు నివసిస్తున్న పాట్నా శివారులోని మీఠాపూర్ ప్రాంతంలో మాత్రం కరెంటు పోవడం లేదా! మీరే న్యాయం చెప్పండి అంటూ పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. మా ఊళ్లో అంతసేపు కరెంటు పోదు. పోయినా త్వరగా వస్తుంది. ఆ ఊళ్లోలాగా గంటలు గంటలు పోనే పోదు. పైగా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవు. ఆక్కడ నా కొడుకు పెరగడం నాకిష్టం లేదు అంటూ రేణు తన వాదన వినిపించింది. చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఏమిటని భావించిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చ చెప్పేందుకు ఎంతో ఓపిగ్గా ప్రయత్నించి విఫలమయ్యారు. మీ తగాదా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రే తీర్చాలి. మావల్ల కాదు అంటూ పోలీసులు చేతులు దులుపుకున్నారు. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న బీహార్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపర్చేందుకు గత తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని చాలా గ్రామాలకు కరెంట్ కనెక్షన్లే లేవు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రామాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే ఓట్ల కోసం రానే రానంటూ నితీష్ కుమార్ శపథం చేసిన విషయం తెల్సిందే.