సోమూర్ సమీపంలో వ్యవసాయ బోరుబావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు
సాక్షి, మద్నూర్(కామారెడ్డి) : గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మేం ఏం తప్పు చేశామని అధికారులు మాకు ఈ శిక్ష వేస్తున్నారు.. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల నుంచి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదని, దీంతో తాగునీటికి తంటాలు పడుతున్నామని వారు వాపోయారు. గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఆది, సోమవారం రెండు రోజులుగా నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బందిపై ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దాడి చేస్తే పూర్తిగా ఊరందరికి శిక్ష ఎందుకు వేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులపై దాడి చేసిన ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, కాని ఉళ్లో ఉన్న అందరి ఇళ్లకు కరెంట్ నిలిపివేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీరు దొరకడం లేదని వారు వాపోయారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు వద్ద నుంచి తాగునీటిని తెచుకోవాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
చీకట్లో ఆరుబయట నిద్రిస్తున్న ప్రజలు
ఫోన్లన్నీ స్విచ్‌ఆఫ్‌లోనే..
రెండు రోజులుగా గ్రామానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఊర్లో ఉన్న ఫోన్లన్నీ స్వీచ్‌ఆఫ్‌లోనే ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్లు చేయాల్సి వస్తే పక్క గ్రామాలకు వెళ్లి ఫో న్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయా రు. రాత్రి సమయాల్లో ఉక్కపోత మరోవైపు దోమలతో జాగారం చేయాల్సివస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఫ్యాన్లు తిరగనిదే పడుకోవడం లేదని తెలిపారు. ఆరుబయట నిద్రి ద్దామంటే వర్షపు చినుకులు పడుకోనివ్వడం లేద ని చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మద్నూర్ ట్రాన్స్‌కో ఏఈ అరవింద్ ను సంప్రదించగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.
రెండు రోజులుగా కరెంట్ కట్
రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లకు వెళ్లాల్సి వస్తోంది. వేసవికాలంలో కూడా వ్యవసాయ బోరు వద్దకు వెళ్లలేదని, కానీ ఇప్పుడు వెళ్లాల్సి వస్తోంది. వారు చేసిన తప్పుకు శిక్ష మేం అనుభవించడం న్యాయమా..?
–గంగారాం పటేల్, గ్రామస్తుడు, సోమూర్
తాగునీటికి ఇబ్బందులు
48 గంటలుగా మా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. సెల్‌ఫోన్లు అన్ని స్విచ్‌ఆఫ్ అయ్యాయి. చిన్న చిన్న వ్యాపారులు కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.
–ఆనంద్, సోమూర్
Comments
Please login to add a commentAdd a comment