people agitation
-
మేమేం చేశాం నేరం..!
సాక్షి, మద్నూర్(కామారెడ్డి) : గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మేం ఏం తప్పు చేశామని అధికారులు మాకు ఈ శిక్ష వేస్తున్నారు.. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల నుంచి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదని, దీంతో తాగునీటికి తంటాలు పడుతున్నామని వారు వాపోయారు. గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆది, సోమవారం రెండు రోజులుగా నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బందిపై ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దాడి చేస్తే పూర్తిగా ఊరందరికి శిక్ష ఎందుకు వేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులపై దాడి చేసిన ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, కాని ఉళ్లో ఉన్న అందరి ఇళ్లకు కరెంట్ నిలిపివేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీరు దొరకడం లేదని వారు వాపోయారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు వద్ద నుంచి తాగునీటిని తెచుకోవాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. చీకట్లో ఆరుబయట నిద్రిస్తున్న ప్రజలు ఫోన్లన్నీ స్విచ్ఆఫ్లోనే.. రెండు రోజులుగా గ్రామానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఊర్లో ఉన్న ఫోన్లన్నీ స్వీచ్ఆఫ్లోనే ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్లు చేయాల్సి వస్తే పక్క గ్రామాలకు వెళ్లి ఫో న్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయా రు. రాత్రి సమయాల్లో ఉక్కపోత మరోవైపు దోమలతో జాగారం చేయాల్సివస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఫ్యాన్లు తిరగనిదే పడుకోవడం లేదని తెలిపారు. ఆరుబయట నిద్రి ద్దామంటే వర్షపు చినుకులు పడుకోనివ్వడం లేద ని చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మద్నూర్ ట్రాన్స్‌కో ఏఈ అరవింద్ ను సంప్రదించగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. రెండు రోజులుగా కరెంట్ కట్ రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లకు వెళ్లాల్సి వస్తోంది. వేసవికాలంలో కూడా వ్యవసాయ బోరు వద్దకు వెళ్లలేదని, కానీ ఇప్పుడు వెళ్లాల్సి వస్తోంది. వారు చేసిన తప్పుకు శిక్ష మేం అనుభవించడం న్యాయమా..? –గంగారాం పటేల్, గ్రామస్తుడు, సోమూర్ తాగునీటికి ఇబ్బందులు 48 గంటలుగా మా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. సెల్ఫోన్లు అన్ని స్విచ్ఆఫ్ అయ్యాయి. చిన్న చిన్న వ్యాపారులు కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. –ఆనంద్, సోమూర్ -
బీసీ కార్పొరేషన్‌కు అరకొర నిధులు
బీసీ నిరుద్యోగులకు రుణాల విషయంలో ఊరించి ఊసురుమనిపించినట్లుంది ప్రభుత్వ తీరు. బీసీ కార్పొరేషన్, వివిధ కుల వృత్తుల ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జిల్లాకు అరకొరగానే నిధులను కేటాయించింది. దీంతో వెనకబడిన తరగతుల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు రాగా ప్రభుత్వం కేటాయించిన నిధులు కొంత మందికే సరిపోతున్నాయి. మోర్తాడ్(బాల్కొండ) : స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం నామమాత్రంగానే నిధులను కేటాయించడంతో కేవలం 13 శాతం మందికి మాత్రమే రాయితీ రుణాలు అం దుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్, జూలైలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాల కోసం 4,755, రూ.లక్షకు మించి రుణాల కోసం 8,830 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేలను వంద శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా నూటికి నూరుశాతం రాయి తీని ప్రకటించిన ప్రభుత్వం ఇందు కోసం జిల్లాకు రూ.8 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను రూ.50 వేల చొప్పున విభజించి 1,600 మందికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. చిన్న వ్యాపారులకే లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం సూచించడంతో చిన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. కాగా కేటగిరి 1లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖా స్తు చేసుకుంటే అలాంటి వాటిని కేటగిరి 1 అని, రూ.లక్షకు మించి ఎక్కువ రుణం కోరితే అలాంటి దరఖాస్తులను కేటగిరి 2 కింద పరిగణించారు. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులనుకేటగిరి 1 కింద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అందులో 1,600 మందిని ఎంపిక చేయగా వంద శాతం రాయితీకి సంబంధించిన రూ.50 వేల చొప్పున చెక్కులను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేవలం 100 మందికి మాత్రమే చెక్కులను పంపిణీ చేశారు. ఇంకా 1,500 మందికి మండల స్థాయిలో సబ్సిడీ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. కేటగిరి 1 కింద 4,755 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,600 మందికి రాయితీ సొమ్ము పంపిణీ చేయనుండగా మిగిలిన 3,155 మందికి మొండి చెయ్యి చూపనున్నారు. కేటగిరి 2లో ఉన్న దరఖాస్తులకు మాత్రం రుణాల పంపిణీ జరిగే అవకాశం కనిపించడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం రాయితీ సొమ్మును ప్రకటించకపోవడంతో బీసీల ఆశలు అడియాసలవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ దరఖాస్తుల ఊసెత్తని ప్రభుత్వం... కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫెడరేషన్ల ఆధ్వర్యంలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా ఆయా వృత్తులకు సంబంధించిన వారు త మ కులాల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులు అం దించారు. విశ్వబ్రహ్మణులు, క్షవరశాలల నిర్వాహకులు, రజకులు, కుమ్మరి, భట్రాజులు, దర్జీ తదితర కుల వృత్తిదారులు తమ ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులను అందించారు. ఫెడరేషన్ల ద్వారా అందిన దరఖాస్తులకు సంబంధించి రుణాల పంపిణీపై ఎలాంటి స్పష్టత లేక పోవడంతో కుల వృత్తులపై ఆధారపడిన వారు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ కార్పొ రేషన్, ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించడానికి నిధులను ఎక్కువ మొత్తంలో విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. -
బ్లాస్టింగు ఆపకుంటే ఊరిడిసి పోతం..
నేలకొండపల్లి : మండలంలోని ఆరెగూడెం-కోనాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆరెగూడెం గ్రామస్తులు బుధవారం ధర్నా నిర్వహించారు. క్వారీలో బ్లాస్టింగ్ వలన ఆరెగూడెం గ్రామంలో ఇళ్లు దెబ్బతింటున్నాయని, పంట పొలాల్లో రాళ్లు పడి పంట నశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్లాస్టింగ్ నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. క్వారీ నిర్వహాకులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ రవీందర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఖమ్మం-కోదాడ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింప చేయించారు. ఈ సందర్భంగా అఖిల పక్షం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బ్లాస్టింగ్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే నిలిపివేయాలన్నారు. బ్లాస్టింగ్‌తో వృద్ధులు, పిల్లలు భయంతో వణికిపోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బ్లాస్టింగ్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఊరిని విడిచిపెట్టి పోతామని అన్నారు. జిల్లా కలెక్టర్‌కు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతోనే క్వారీని నిర్వహిస్తున్నారని తమకు న్యాయం చే యకుంటే క్వారీ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘీభావంగా పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీవై.పుల్లయ్య, పగిడికత్తుల రాందాసు, మాలమహానాడు మండలాధ్యక్షుడు బట్టపోతుల ప్రకాషం, ఆరెగూడెం అఖిల పక్షం నాయకులు వడ్డె జగన్, కొంగర సుబ్బయ్య, మీగడ లింగరాజు, దొనకొండ రామకృష్ణ, ఆంజనేయులు, కణతాల వెంకటేశ్వర్లు, వడ్డె లక్ష్మయ్య, వడ్డె వెంకటేశ్వరరావు, బొడ్డు ఉపేందర్, బొడ్డు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. -
వణుకుతున్న అన్నంరాజుపేట
జామి విజయనగరం : మండలంలోని అన్నంరాజుపేటలో జ్వరాలు ప్రబలాయి. ప్రతి ఇంటికీ ఒకరిద్దరు జ్వరపీడితులున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికీ ఇద్దరు, ముగ్గురు మంచానపడ్డారు. గ్రామానికి చెందిన కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయగా, మరికొంతమంది విజయనగరం కేంద్రాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, తదితర సమస్యలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ కాలనిలో సుమారు 50 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన అలమండ బంగార్రాజు జ్వరం, పచ్చకామెర్లతో సోమవారం మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో బంగార్రాజు అలమండ పీహెచ్సీలో వైద్యం పొందాడు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనంతరం కేంద్రాస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ,ఇద్దరు చిన్నారులు రేవంత్(5), హరీష్(4)ఉన్నారు. ఆందోళనలో కాలనీవాసులు పారిశుద్ద్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలా యని కాలనీ వాసులు చెబుతున్నారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని అంబేడ్కర్ యువజన సంఘ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై ఏఆర్ పేట వైద్యాధికారి తూర్పాటి వెంకటరావు మాట్లాడుతూ, కాలనీకి చెందిన బంగార్రాజు అలమండ పీహెచ్‌సీకి రాగా విజయనగరం ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అక్కడ పచ్చకామెర్లకు చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. పీహెచ్సీ పరిధిలోని ఆరు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. అలాగే పారిశుద్ధ్యం, క్లోరినేషన్ విషయమై ఈఓపీఆర్డీ ఏవీ లక్ష్మి వద్ద ప్రస్తావించగా, తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపడతామని చెప్పారు. పాతబగ్గాంలో డెంగీ.. గజపతినగరం/ విజయనగరం ఫోర్ట్ : గజపతినగరం మండలం పాతబగ్గాం పంచాయతీ ఎరుకలపేటలో పాలవలస మోహన్ (13) డెంగీ లక్షణాలతో విజయనగరం కేంద్రాస్పత్రిలో సోమవారం చేరాడు. అలాగే గ్రామానికి చెందిన దాసరి సింహాచలం, హర్ష, కిరణ్, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. మోహన్‌కు ప్లేట్లెట్స్ తగ్గినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు పాలవలస రమణ, పైడితల్లి తెలిపారు. విషయం తెలుసుకున్న మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి జయశ్రీ గ్రామంలో సోమవారం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే జ్వరాలు ఉన్నట్టు వైద్యాధికారిణి తెలిపారు. గుమ్మిడివరంలో ప్రబలిన జ్వరాలు సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట పంచాయతీ గుమ్మిడివరంలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలాయని చెబుతున్నారు. గ్రామానికి చెందిన జి. లీలావతి, పి. వనజాక్షి, కె. గౌరమ్మ, తదితర 30 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది డీవీ సత్యనారాయణ, ఆర్. స్వర్ణ, ఆశ వర్కర్ పి. లక్ష్మి, తదితరులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో కాలువలు సగం వరకు నిర్మించి వదిలేయడంతో ఎప్పుడు వర్షాలు పడినా పరిస్థితి అధ్వానంగా మారుతుందని జి. కృష్ణరాజు, తదితరులు తెలిపారు. కిటకిటలాడిన కేంద్రాస్పత్రి ..1200కు పైగా వచ్చిన రోగులు విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రాస్పత్రికి సోమవారం రోగులు పోటెత్తారు. అన్ని ఓపీలకు రోగులు అధిక సంఖ్యలో వచ్చారు. మానసిక, దంత విభాగాలు మినహాయించి ప్రతీ ఓపీ విభాగానికి 100కు పైగా రోగులు వచ్చారు. దీంతో వైద్యులు రోగులకు వైద్యసేవలందించడానికి అవస్థలు పడ్డారు. ఓపీ చీటీలు ఇచ్చే విభాగం, ఫార్మసీ ఇలా అన్ని విభాగాలు రోగులతో నిండిపోయాయి. -
వింత పాముల సంచారం.. భయాందోళనలో ప్రజలు
కమాన్‌పూర్ : మండలంలోని పేంచికల్‌పేట గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహపురం కాలనీలో కొన్ని రోజులుగా విషపాముల సంచారంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పునరావాస కాలనీని సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రెండు రోజుల కిత్రం కాలనీలోకి వచ్చిన కొండ చిలువను చంపితే మరల నేడు రక్త పింజర రావడంతో భయాందోళనలో జీవిస్తున్నారు. వెంటనే సింగరేణి అధికారులు స్పందించి విష సర్పాల నుంచి కాపాడేందుకు కావాల్సిన మౌలిక వసతులు కాలనీలో కల్పించాలని వేడుకుంటున్నారు. -
22 రోజులు.. 17 చోరీలు
జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం 22 రోజుల వ్యవధిలో 17 దొంగతనాలు నమోదు కావడం గమనార్హం. వరుస చోరీలతో మహారాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. ఎంత నిఘా పెట్టినా యథేచ్ఛగా ‘పని’ చేసుకుపోతోంది. నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ‘మహా’ దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ సహా వివిధ మండలాలలో వరుస చోరీలకు తెగబడుతున్నారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే చాలు, ఆ ఇంటిని గుల్ల చేసేస్తున్నారు. గతంలో ఎక్కువగా శివారు ప్రాంతాలలో దొంగతనాలు జరిగేవి. కానీ ఇప్పుడు నగర నడిబొడ్డున, జనాలు సంచరించే ప్రాంతాల్లోనే బరి తెగిస్తున్న చోరులు.. నగదు, ఆభరణాలతో ఉడాయిస్తున్నారు. పోలీసులు ఎంత యత్నించినా దొంగతనాలు ఆగడం లేదు.. దొంగలు చిక్కడం లేదు. రాత్రిపూట గస్తీ పెంచాలని, ముమ్మరంగా పెట్రోలింగ్ చేయాలని, బ్లూకోర్ట్స్ నిరంతరంగా తిరగాలని ప్రతి నేర సమీక్షా సమావేశంలో సీపీ కార్తికేయ ఆదేశిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ చాలా చోట్ల గస్తీ పెంచక పోవడంతో దొంగల పని సులువవుతోంది. జిల్లా వ్యాప్తంగా గత జనవరి నుంచి మే వరకు రాత్రిపూట 45 చోరీలు, పగటి పూట 8 చోరీలు నమోదయ్యాయి. జూన్ నెలలో ఇప్పటివరకు రాత్రి వేళలో 15, పగటి పూట 2 దొంగతనాలు జరిగాయి. 22 రోజులలో 17 చోరీ కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించే అంశం. మహారాష్ట్ర ముఠా పనే.. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన దొంగతనాలు ఎక్కువగా మహారాష్ట్ర ముఠాకు చెందిన పనేనని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటుంది. తాళాలు పగులగొట్టి సొత్తుతో ఉడాయిస్తోంది. ఇలా వరుస చోరీలకు పాల్పడుతూ జిల్లా వాసులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ‘మహా’ ముఠా సభ్యులు. జిల్లా సరిహద్దు పక్కనే మహారాష్ట్ర ఉండటం, అక్కడి నుంచి దొంగలు రైలులో పగటì పూట వచ్చి చోరీలకు అనువుగా ఉండే కాలనీలలో రెక్కీ నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న కాలనీలలో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠా సభ్యులు.. తెల్లవారుజామున రైలెక్కి సొంత ప్రాంతానికి వెళ్లి పోతున్నారు. చోరీలకు పాల్పడుతున్న వారిలో జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన వారిలో నలుగురు జిల్లా కేంద్రానికి చెందిన వారే కావడం గమనార్హం. రైల్వే స్టేషన్లో నిఘా పెడితే.. మహారాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో చోరీలకు పాల్పడి రైళ్ల ద్వారానే పారిపోయేందుకు యత్నిస్తున్నారు. మహారాష్ట్ర వైపు అనేక రైళ్లు నడుస్తుండటం వారికి కలిసొస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్లలో దొంగలు సులువుగా తప్పించుకుని పారిపోతున్నారు. పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి ఉదయం వరకు మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్లలో ఎక్కె వారిపై నిఘా పెడితే దొంగలు చిక్కే అవకాశం ఉంది. అలాగే, మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీలకు కొంత వరకు అడ్డుకట్ట వేయవచ్చు. పాత నేరస్తులే.. చోరీలకు పాల్పడుతున్న వారిలో పాత నేరస్తులే ఎక్కువగా ఉంటున్నారు. పోలీసులకు పట్టుబడుతున్న దొంగలకు సరైన శిక్షలు పడడం లేదు. దొంగతనాలు చేసే వారికి ఆరు నెలలు, ఏడాదికి మించి జైలు శిక్ష పడడం లేదు. దీంతో వారు శిక్ష కాలం పూర్తి చేసుకొని బయటకు వచ్చీ రాగానే మళ్లీ చోరీల బాట పడుతున్నారు. తరుచూ దొంగతనాలు చేసే వారిలో సత్పవర్తన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఈ నెలలో నగరంలో జరిగిన చోరీలు.. ఈ నెల 9న తెల్లవారుజామున దుబ్బా అరుంధతీయ కాలనీలో బ్యాంక్ ఉద్యోగి నాగభూషణం ఇంట్లో దొంగలు పడి 32 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. 12వ తేదీన మూడు చోట్ల చోరీలకు తెగబడ్డారు. వినాయక్‌నగర్, అయోధ్యనగర్‌లో మూడిళ్లలోకి చొరబడ్డ దుండగులు.. 14 తులాల బంగారం అపహరించారు. ఈ నెల 20న న్యూ ఎన్జీవోస్ కాలనీలో రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది. ఐదు తులాల ఆభరణాలతో ఉడాయించారు. -
జనం కరువాయే.. దీక్షలు బరువాయే..!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈనెల శుక్రవారం నుంచి చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు జనాలు కరువయ్యారు. తమ పరువు కాపాడుకోవడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. జనాలు రాక సభల నిర్వహణ అధికారులకు బరువవుతోంది. ఎక్కడ చూసినా జనం నుంచి నవ నిర్మాణదీక్షలకు స్పందన లేదు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు, టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండాపోతోంది. కేవలం పింఛన్ ఇస్తామని లబ్ధిదారులు సభలకు తిప్పుకోండం.. ఇవ్వకుండా రేపురండని అంటూ ఉద్యోగులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సభలకు జనాలు రాకపోవడానికి కారణం.. నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి ఎసరుపెట్టి కేవలం పసుపు కుంకుమగా మార్చి అంతో ఇంతో ఇచ్చే సొమ్మును కూడా కంతుల రూపంలో ఆలస్యం చేయడంపై మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, నిరుపేదలకు ఇల్లు ఇలా అనేక రకాల హామీలిచ్చి అంతంత మాత్రంగా కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ గ్రామసభలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. కేవలం దీక్షల్లో అధికారులు మాత్రమే ఉంటున్నారు. అంతటా.. అంతంత మాత్రంగానే జిల్లాలో ఎక్కడ చూసినా నవ నిర్మాణ దీక్షలు వెలవెలబోతున్నాయి. కలెక్టర్ హరికిరణ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైన దీక్షలు మినహా అన్ని చోట్ల జనం కరువవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈ సారి మండల కేంద్రాలతోపాటు పంచాయతీల్లో ఎనిమిది రోజుల నవ నిర్మాణ దీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్లెల్లో ఎక్కడా జనం లేని దీక్షలే కనిపిస్తున్నాయి. జనాలు నిండుగా ఉండే దీక్షలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీక్షల్లో ఒక అంకె దాటని జనం.. జిల్లాలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో జనం ముగ్గురు, అయిదు మంది, ఏడు మంది, పది మంది ఇలా కనిపిస్తున్నారు. వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల్లో కేవలం ఐదారు మందే కనిపించారు. అలాగే రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల్లోని పలు చోట్ల కేవలం పది మందిలోపే జనాలు కనిపించా రు. పులివెందులలోని మిస్సమ్మ బంగ్లాలో నిర్వహించిన దీక్షకు జనం లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహిస్తున్న సభలకు కూ డా జనాలు లేక కేవలం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో ప్రజలు లేక నవ నిర్మాణదీక్ష బోసిపోయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల జనం లేని సభలే దర్శనమిస్తున్నా యి. అందునా పింఛన్ల కోసం వృద్ధులను తీసుకొ స్తుండగా.. డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్క ర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనం లేకపోవడంతో ఎవరో ఒకరు కనిపిస్తే కొంతైనా దీక్షలకు స్పందనగా చూపించవచ్చని అధికార యంత్రాంగం ఆరాట పడుతోంది. -
పరారీలో బంగారం వ్యాపారి
నరసన్నపేట: నరసన్నపేటలోని బజారువీధిలో శ్రీ సంతోషిమాతా జ్యూయలర్ పేరున బంగారం షాపు నిర్వహిస్తున్న పొట్నూరు సన్యాసిరావు పరారయ్యాడు. 15 రోజులుగా షాపు తెరవక పోవడం, ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఏమైందని ఆరా తీసిన బాధితులు సన్యాసిరావుకు ఫోను చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తుండంతో లబోదిబోమంటున్నారు. సన్యాసిరావు 12 ఏళ్ల క్రితం ఇలాగే పరారై రూ.50 లక్షలకు పైగా స్థానికులకు టోకరా వేశాడు. కొన్నేళ్ల కిందట తిరిగి నరసన్నపేట వచ్చి మళ్లీ బంగారం షాపు పెట్టాడు. పాత అప్పులు తీర్చకపోగా కొత్తగా షాపు నిర్వహణ, బంగారం వస్తువుల పేరిట పరిసర గ్రామాలకు చెందిన వారి నుంచి అధికంగా డబ్బు సేకరించి మరోసారి పరారయ్యాడు. ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి రూ.10 లక్షల వరకూ అప్పు చేసినట్లు సమాచారం. బంగారం వస్తువులు ఇస్తానని తోటి బంగారం షాపుల వారి నుంచి రూ.10 లక్షల వరకూ టోపీ వేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు జమ్ము, తామరాపల్లి, గోపాలపెంట, పోతయ్యవలస, మడపాం, యారబాడు గ్రామస్తుల నుంచి రూ. 5 లక్షల వరకూ తీసుకున్నట్లు సమాచారం. నమ్మి పోసపోయాం.. జమ్ముకు చెందిన వాన చిన్నమ్మి, పీస లక్ష్మి, నరసన్నపేట బజారు వీధికి చెం దిన లక్ష్మిలు మాట్లాడుతూ బంగారం వస్తువులు ఇస్తానని సన్యాసిరావు చెప్పడంతో నమ్మి మోసపోయామని వాపోయారు. ఈ విషయమై సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ సన్యాసిరావు పరారైన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వక పోవడంతో దర్యాప్తు చేయలేకపోతున్నామని చెప్పారు. -
తమిళ సీఎం దమ్ము.. ఆంధ్రా సీఎంకేది?
హైదరాబాద్: అస్తిత్వం ఎప్పుడూ అసువులు బాయదు.. ఎప్పటికైనా తన మనుగడను కాపాడుకుంటుంది. అది సాధించే క్రమంలో కాస్తంత జాప్యం జరగొచ్చేమోగానీ.. జరిగితీరుతుంది. అది మొన్నటి తెలంగాణ ఉద్యమం కావొచ్చు.. నిన్నటి జల్లికట్టు కావచ్చు.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హక్కు కావచ్చు. ఈ మూడు అంశాల్లో ప్రధానంగా నిండి ఉన్న అంశం అస్తిత్వం. దీనికి హాని జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలే తప్ప తాత్కాలిక ఉపశమన చర్యలు ఎక్కువకాలం నిలవవు. ఆపినంత కాలం మరింత బలాన్ని పెంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా హక్కును కాకుండా ఇచ్చిన ప్యాకేజీ కూడా ఒక కంటి తుడుపు చర్యే.. బిందువంత ఉపశమనం. రాజకీయ స్వార్ధంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బ్రహ్మాండం అంటూ చూపించి భ్రమలు చేతిలో పెట్టారు. అందుకే, ప్యాకేజీ ప్రకటించి చాలా రోజులైనా ప్రత్యేక హోదా ఇప్పటికీ ఓ బడబాగ్నిలా రాజుకుంటూనే ఉంది. ఎవరు దానికోసం ముందుకెళ్లినా ప్రజలు వారి వెనుక వస్తున్నారు.. ఎందుకంటే అందులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది.. ఆశలు ఉన్నాయి.. కలలు ఉన్నాయి. అన్నింటికి మించి తమకు ఇస్తానన్నది ఇవ్వడం ద్వారా వారికి గొప్ప సంతృప్తి లభిస్తుంది. ప్రజలు లేనిదే నాయకుడు లేడు.. పాలకుడు లేడు.. చట్టాలు లేవు. ఏం చేసినా ప్రజలకోసమే చేయాలే తప్ప మరో ఉద్దేశంతో ఎలాంటి పనులు చేయరాదు. అలా చేస్తే ఎప్పటికీ ఓ ప్రశ్న తరాల మెదళ్లను కదిలిస్తూనే ఉంటుంది.. పరిధిని పెంచుకుంటూనే ఉంటుంది. సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కును ఇస్తున్నామని ప్రకటించగా పదేళ్లు ఇవ్వాలని నాటి బీజేపీ కోరింది. ఆ మాట ప్రకారం దానిని నెరవేర్చి తీరాలి. ఒక వేళ కేంద్రం అలా నెరవేర్చనప్పుడు రాష్ట్రంలోని పాలకుడు దానిని అమలుచేయించుకునేందుకు శంఖం పూరించాలి. విజయం సాధించాలంటే ప్రజలను తీసుకెళ్లాలి.. ముఖ్యమంత్రి అయినా ప్రజలతో కలిసి పోరాడాలి. ఉద్యమం చేసిన ప్రజలుగానీ, వారితో కలిసి పనిచేసిన నాయకుడుగానీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఇది తెలంగాణ విషయంలో, జల్లికట్టు విషయంలో స్పష్టమైంది.. గత ఉద్యమాల్లో కూడా రుజువైంది. కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది. జల్లికట్టు ఉద్యమానికి సాక్షాత్తు అక్కడి ముఖ్యమంత్రి దాదాపు సారథ్యం వహించినంత పనిచేసి విజయాన్ని అందుకోగా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు వేరు నేను వేరు.. నాకు ఏపీ ప్రజలకు సంబంధం లేదు.. అది వారి డిమాండే తనకు సంబంధించింది కాదు.. తన రాజ్యంలో ఎవరూ ఆందోళన చేసినా అదిమేస్తాం.. చిదిమేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించలేనప్పుడు ప్రజల సహాయంతో తన గొంతు వినిపించాల్సిన ముఖ్యమంత్రి మొత్తం ఏపీ గొంతును నొక్కేసే పనిచేస్తున్నారు. ఇదేదో ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరుస్తుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బలగాలను, పోలీసులను ఉద్యమాలను అణిచేందుకు ఉపయోగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలిసి తిరిగి అదే పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్యాకేజీ విషయంలో అసంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలకు జల్లికట్టు పెద్ద మంచి స్ఫూర్తిని రగిలించింది. గతంలో ఒకే ఒక్క ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదాకోసం తీవ్రంగా శ్రమించినా చివరికి దాని ఆవశ్యకత గుర్తించి నేడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తాము సైతం అంటూ ముందుకు కదిలాయి. యువత కూడా బలమైన ముందడుగేసింది. ఈ సమయాన్ని ఉపయోగించుకోని కేంద్రానికి ప్రజల అభీష్టాన్ని బలంగా చెప్పాల్సిన ముఖ్యమంత్రి బలగాలను నమ్ముకొని ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితి సృష్టించారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ఈ తీరు చూస్తుంటే ఆయన కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారాడని, అందుకు ఆయన చేసిన తప్పులే కారణం అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కడి మేలు కోసం చూస్తే మొత్తం ఏపీ ప్రజల భవిష్యత్తు వేగం నెమ్మదిస్తుంది. ఆయన స్వార్థం విడిచి ప్రజలతో కలిసి ముందుకెళితే మొత్తం తెలుగు సమాజం గర్విస్తుంది. కానీ, ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తారో ఆయన తెలుసుకోవాలి. -
ప్రైవేటుకే పంపిస్తాం.. సర్కార్ డబ్బులివ్వాల్సిందే
లిస్బాన్: పోర్చుగల్‌లో ప్రైవేటు పాఠశాలలకు మద్దతుగా భారీ ఉద్యమం మొదలైంది. ఇక నుంచి తాము పూర్తి స్థాయిలో నిధులు ప్రభుత్వ పాఠశాలలపైనే పెడతామని ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి ప్రజలు, విద్యార్థులు, ప్రైవేటు టీచర్లు వీధుల్లో పోరు బాట పట్టారు. దాదాపు 40వేలమంది పచ్చరంగు టీ షర్ట్స్ ధరించి డప్పులు వాయిస్తూ జాతీయ గీతం పాడుతూ లిస్బాన్లోని జులియో అమెన్యూ వద్దకు డీ.కార్లోస్ ప్రాంగాణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు పార్లమెంటుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమానికి డీఫెసా డా ఎస్కోలా పోంటో(డీఈపీ) నాయకత్వం వహిస్తోంది. ప్రైవేటు స్కూళ్ల రక్షణే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటీవల విద్యావిధానం పై అన్ని రకాలుగా సమీక్ష నిర్వహించిన పోర్చుగల్ ప్రభుత్వం విద్యా ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించాలని, ప్రైవేటు స్కూళ్లో చదివే వారికి తాము నిధులు చెల్లించబోమని ప్రకటించింది. ఒక్క ప్రభుత్వ స్కూళ్ల ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యం అని చెప్పింది. ఈ ఒక్క ప్రకటనతో అనూహ్యంగా పలు ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతోపాటు విద్యార్థులు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో మాత్రమే ఒక ఒప్పందం ద్వారా చేరాలి అని విధించిన నిబంధన కూడా ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగించి ఉద్యమబాట పట్టారు.