ప్రతీకాత్మక చిత్రం
బీసీ నిరుద్యోగులకు రుణాల విషయంలో ఊరించి ఊసురుమనిపించినట్లుంది ప్రభుత్వ తీరు. బీసీ కార్పొరేషన్, వివిధ కుల వృత్తుల ఫెడరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జిల్లాకు అరకొరగానే నిధులను కేటాయించింది. దీంతో వెనకబడిన తరగతుల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు రాగా ప్రభుత్వం కేటాయించిన నిధులు కొంత మందికే సరిపోతున్నాయి.
మోర్తాడ్(బాల్కొండ) : స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం నామమాత్రంగానే నిధులను కేటాయించడంతో కేవలం 13 శాతం మందికి మాత్రమే రాయితీ రుణాలు అం దుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్, జూలైలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాల కోసం 4,755, రూ.లక్షకు మించి రుణాల కోసం 8,830 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేలను వంద శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది.
బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా నూటికి నూరుశాతం రాయి తీని ప్రకటించిన ప్రభుత్వం ఇందు కోసం జిల్లాకు రూ.8 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను రూ.50 వేల చొప్పున విభజించి 1,600 మందికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. చిన్న వ్యాపారులకే లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం సూచించడంతో చిన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. కాగా కేటగిరి 1లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖా స్తు చేసుకుంటే అలాంటి వాటిని కేటగిరి 1 అని, రూ.లక్షకు మించి ఎక్కువ రుణం కోరితే అలాంటి దరఖాస్తులను కేటగిరి 2 కింద పరిగణించారు.
ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులనుకేటగిరి 1 కింద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అందులో 1,600 మందిని ఎంపిక చేయగా వంద శాతం రాయితీకి సంబంధించిన రూ.50 వేల చొప్పున చెక్కులను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేవలం 100 మందికి మాత్రమే చెక్కులను పంపిణీ చేశారు. ఇంకా 1,500 మందికి మండల స్థాయిలో సబ్సిడీ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది.
కేటగిరి 1 కింద 4,755 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,600 మందికి రాయితీ సొమ్ము పంపిణీ చేయనుండగా మిగిలిన 3,155 మందికి మొండి చెయ్యి చూపనున్నారు. కేటగిరి 2లో ఉన్న దరఖాస్తులకు మాత్రం రుణాల పంపిణీ జరిగే అవకాశం కనిపించడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం రాయితీ సొమ్మును ప్రకటించకపోవడంతో బీసీల ఆశలు అడియాసలవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫెడరేషన్ దరఖాస్తుల ఊసెత్తని ప్రభుత్వం...
కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా ఆయా వృత్తులకు సంబంధించిన వారు త మ కులాల ఫెడరేషన్‌ల ద్వారా దరఖాస్తులు అం దించారు. విశ్వబ్రహ్మణులు, క్షవరశాలల నిర్వాహకులు, రజకులు, కుమ్మరి, భట్రాజులు, దర్జీ తదితర కుల వృత్తిదారులు తమ ఫెడరేషన్‌ల ద్వారా దరఖాస్తులను అందించారు.
ఫెడరేషన్‌ల ద్వారా అందిన దరఖాస్తులకు సంబంధించి రుణాల పంపిణీపై ఎలాంటి స్పష్టత లేక పోవడంతో కుల వృత్తులపై ఆధారపడిన వారు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ కార్పొ రేషన్, ఫెడరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలను అందించడానికి నిధులను ఎక్కువ మొత్తంలో విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment