ప్రతీకాత్మక చిత్రం
జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం 22 రోజుల వ్యవధిలో 17 దొంగతనాలు నమోదు కావడం గమనార్హం. వరుస చోరీలతో మహారాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. ఎంత నిఘా పెట్టినా యథేచ్ఛగా ‘పని’ చేసుకుపోతోంది.
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ‘మహా’ దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ సహా వివిధ మండలాలలో వరుస చోరీలకు తెగబడుతున్నారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే చాలు, ఆ ఇంటిని గుల్ల చేసేస్తున్నారు. గతంలో ఎక్కువగా శివారు ప్రాంతాలలో దొంగతనాలు జరిగేవి. కానీ ఇప్పుడు నగర నడిబొడ్డున, జనాలు సంచరించే ప్రాంతాల్లోనే బరి తెగిస్తున్న చోరులు.. నగదు, ఆభరణాలతో ఉడాయిస్తున్నారు.
పోలీసులు ఎంత యత్నించినా దొంగతనాలు ఆగడం లేదు.. దొంగలు చిక్కడం లేదు. రాత్రిపూట గస్తీ పెంచాలని, ముమ్మరంగా పెట్రోలింగ్ చేయాలని, బ్లూకోర్ట్స్ నిరంతరంగా తిరగాలని ప్రతి నేర సమీక్షా సమావేశంలో సీపీ కార్తికేయ ఆదేశిస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ చాలా చోట్ల గస్తీ పెంచక పోవడంతో దొంగల పని సులువవుతోంది. జిల్లా వ్యాప్తంగా గత జనవరి నుంచి మే వరకు రాత్రిపూట 45 చోరీలు, పగటి పూట 8 చోరీలు నమోదయ్యాయి. జూన్ నెలలో ఇప్పటివరకు రాత్రి వేళలో 15, పగటి పూట 2 దొంగతనాలు జరిగాయి. 22 రోజులలో 17 చోరీ కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించే అంశం.
మహారాష్ట్ర ముఠా పనే..
జిల్లాలో ఇప్పటివరకు జరిగిన దొంగతనాలు ఎక్కువగా మహారాష్ట్ర ముఠాకు చెందిన పనేనని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటుంది. తాళాలు పగులగొట్టి సొత్తుతో ఉడాయిస్తోంది. ఇలా వరుస చోరీలకు పాల్పడుతూ జిల్లా వాసులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ‘మహా’ ముఠా సభ్యులు.
జిల్లా సరిహద్దు పక్కనే మహారాష్ట్ర ఉండటం, అక్కడి నుంచి దొంగలు రైలులో పగటì పూట వచ్చి చోరీలకు అనువుగా ఉండే కాలనీలలో రెక్కీ నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న కాలనీలలో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు.
యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠా సభ్యులు.. తెల్లవారుజామున రైలెక్కి సొంత ప్రాంతానికి వెళ్లి పోతున్నారు. చోరీలకు పాల్పడుతున్న వారిలో జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన వారిలో నలుగురు జిల్లా కేంద్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
రైల్వే స్టేషన్‌లో నిఘా పెడితే..
మహారాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో చోరీలకు పాల్పడి రైళ్ల ద్వారానే పారిపోయేందుకు యత్నిస్తున్నారు. మహారాష్ట్ర వైపు అనేక రైళ్లు నడుస్తుండటం వారికి కలిసొస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్లలో దొంగలు సులువుగా తప్పించుకుని పారిపోతున్నారు.
పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి ఉదయం వరకు మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్లలో ఎక్కె వారిపై నిఘా పెడితే దొంగలు చిక్కే అవకాశం ఉంది. అలాగే, మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీలకు కొంత వరకు అడ్డుకట్ట వేయవచ్చు.
పాత నేరస్తులే..
చోరీలకు పాల్పడుతున్న వారిలో పాత నేరస్తులే ఎక్కువగా ఉంటున్నారు. పోలీసులకు పట్టుబడుతున్న దొంగలకు సరైన శిక్షలు పడడం లేదు. దొంగతనాలు చేసే వారికి ఆరు నెలలు, ఏడాదికి మించి జైలు శిక్ష పడడం లేదు. దీంతో వారు శిక్ష కాలం పూర్తి చేసుకొని బయటకు వచ్చీ రాగానే మళ్లీ చోరీల బాట పడుతున్నారు. తరుచూ దొంగతనాలు చేసే వారిలో సత్పవర్తన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు.
ఈ నెలలో నగరంలో జరిగిన చోరీలు..
ఈ నెల 9న తెల్లవారుజామున దుబ్బా అరుంధతీయ కాలనీలో బ్యాంక్ ఉద్యోగి నాగభూషణం ఇంట్లో దొంగలు పడి 32 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు.
12వ తేదీన మూడు చోట్ల చోరీలకు తెగబడ్డారు. వినాయక్‌నగర్, అయోధ్యనగర్‌లో మూడిళ్లలోకి చొరబడ్డ దుండగులు.. 14 తులాల బంగారం అపహరించారు.
ఈ నెల 20న న్యూ ఎన్జీవోస్ కాలనీలో రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది. ఐదు తులాల ఆభరణాలతో ఉడాయించారు.
Comments
Please login to add a commentAdd a comment