హైదరాబాద్: అస్తిత్వం ఎప్పుడూ అసువులు బాయదు.. ఎప్పటికైనా తన మనుగడను కాపాడుకుంటుంది. అది సాధించే క్రమంలో కాస్తంత జాప్యం జరగొచ్చేమోగానీ.. జరిగితీరుతుంది. అది మొన్నటి తెలంగాణ ఉద్యమం కావొచ్చు.. నిన్నటి జల్లికట్టు కావచ్చు.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హక్కు కావచ్చు. ఈ మూడు అంశాల్లో ప్రధానంగా నిండి ఉన్న అంశం అస్తిత్వం. దీనికి హాని జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలే తప్ప తాత్కాలిక ఉపశమన చర్యలు ఎక్కువకాలం నిలవవు.
ఆపినంత కాలం మరింత బలాన్ని పెంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా హక్కును కాకుండా ఇచ్చిన ప్యాకేజీ కూడా ఒక కంటి తుడుపు చర్యే.. బిందువంత ఉపశమనం. రాజకీయ స్వార్ధంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బ్రహ్మాండం అంటూ చూపించి భ్రమలు చేతిలో పెట్టారు. అందుకే, ప్యాకేజీ ప్రకటించి చాలా రోజులైనా ప్రత్యేక హోదా ఇప్పటికీ ఓ బడబాగ్నిలా రాజుకుంటూనే ఉంది. ఎవరు దానికోసం ముందుకెళ్లినా ప్రజలు వారి వెనుక వస్తున్నారు.. ఎందుకంటే అందులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది.. ఆశలు ఉన్నాయి.. కలలు ఉన్నాయి. అన్నింటికి మించి తమకు ఇస్తానన్నది ఇవ్వడం ద్వారా వారికి గొప్ప సంతృప్తి లభిస్తుంది.
ప్రజలు లేనిదే నాయకుడు లేడు.. పాలకుడు లేడు.. చట్టాలు లేవు. ఏం చేసినా ప్రజలకోసమే చేయాలే తప్ప మరో ఉద్దేశంతో ఎలాంటి పనులు చేయరాదు. అలా చేస్తే ఎప్పటికీ ఓ ప్రశ్న తరాల మెదళ్లను కదిలిస్తూనే ఉంటుంది.. పరిధిని పెంచుకుంటూనే ఉంటుంది. సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కును ఇస్తున్నామని ప్రకటించగా పదేళ్లు ఇవ్వాలని నాటి బీజేపీ కోరింది. ఆ మాట ప్రకారం దానిని నెరవేర్చి తీరాలి. ఒక వేళ కేంద్రం అలా నెరవేర్చనప్పుడు రాష్ట్రంలోని పాలకుడు దానిని అమలుచేయించుకునేందుకు శంఖం పూరించాలి. విజయం సాధించాలంటే ప్రజలను తీసుకెళ్లాలి.. ముఖ్యమంత్రి అయినా ప్రజలతో కలిసి పోరాడాలి. ఉద్యమం చేసిన ప్రజలుగానీ, వారితో కలిసి పనిచేసిన నాయకుడుగానీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఇది తెలంగాణ విషయంలో, జల్లికట్టు విషయంలో స్పష్టమైంది.. గత ఉద్యమాల్లో కూడా రుజువైంది. కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది.
జల్లికట్టు ఉద్యమానికి సాక్షాత్తు అక్కడి ముఖ్యమంత్రి దాదాపు సారథ్యం వహించినంత పనిచేసి విజయాన్ని అందుకోగా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు వేరు నేను వేరు.. నాకు ఏపీ ప్రజలకు సంబంధం లేదు.. అది వారి డిమాండే తనకు సంబంధించింది కాదు.. తన రాజ్యంలో ఎవరూ ఆందోళన చేసినా అదిమేస్తాం.. చిదిమేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించలేనప్పుడు ప్రజల సహాయంతో తన గొంతు వినిపించాల్సిన ముఖ్యమంత్రి మొత్తం ఏపీ గొంతును నొక్కేసే పనిచేస్తున్నారు. ఇదేదో ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరుస్తుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బలగాలను, పోలీసులను ఉద్యమాలను అణిచేందుకు ఉపయోగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలిసి తిరిగి అదే పనిచేస్తున్నారు.
వాస్తవానికి ప్యాకేజీ విషయంలో అసంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలకు జల్లికట్టు పెద్ద మంచి స్ఫూర్తిని రగిలించింది. గతంలో ఒకే ఒక్క ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదాకోసం తీవ్రంగా శ్రమించినా చివరికి దాని ఆవశ్యకత గుర్తించి నేడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తాము సైతం అంటూ ముందుకు కదిలాయి. యువత కూడా బలమైన ముందడుగేసింది. ఈ సమయాన్ని ఉపయోగించుకోని కేంద్రానికి ప్రజల అభీష్టాన్ని బలంగా చెప్పాల్సిన ముఖ్యమంత్రి బలగాలను నమ్ముకొని ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితి సృష్టించారు.
ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ఈ తీరు చూస్తుంటే ఆయన కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారాడని, అందుకు ఆయన చేసిన తప్పులే కారణం అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కడి మేలు కోసం చూస్తే మొత్తం ఏపీ ప్రజల భవిష్యత్తు వేగం నెమ్మదిస్తుంది. ఆయన స్వార్థం విడిచి ప్రజలతో కలిసి ముందుకెళితే మొత్తం తెలుగు సమాజం గర్విస్తుంది. కానీ, ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తారో ఆయన తెలుసుకోవాలి.
తమిళ సీఎం దమ్ము.. ఆంధ్రా సీఎంకేది?
Published Thu, Jan 26 2017 6:31 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement