డిప్యూటీ తహసీల్దార్ రవీందర్‌కు వినతి పత్రం అందిస్తున్న దృశ్యం
నేలకొండపల్లి : మండలంలోని ఆరెగూడెం-కోనాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆరెగూడెం గ్రామస్తులు బుధవారం ధర్నా నిర్వహించారు. క్వారీలో బ్లాస్టింగ్ వలన ఆరెగూడెం గ్రామంలో ఇళ్లు దెబ్బతింటున్నాయని, పంట పొలాల్లో రాళ్లు పడి పంట నశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్లాస్టింగ్ నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు.
తొలుత తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. క్వారీ నిర్వహాకులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ రవీందర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఖమ్మం-కోదాడ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింప చేయించారు.
ఈ సందర్భంగా అఖిల పక్షం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బ్లాస్టింగ్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే నిలిపివేయాలన్నారు. బ్లాస్టింగ్‌తో వృద్ధులు, పిల్లలు భయంతో వణికిపోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బ్లాస్టింగ్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఊరిని విడిచిపెట్టి పోతామని అన్నారు.
జిల్లా కలెక్టర్‌కు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతోనే క్వారీని నిర్వహిస్తున్నారని తమకు న్యాయం చే యకుంటే క్వారీ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘీభావంగా పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీవై.పుల్లయ్య, పగిడికత్తుల రాందాసు, మాలమహానాడు మండలాధ్యక్షుడు బట్టపోతుల ప్రకాషం, ఆరెగూడెం అఖిల పక్షం నాయకులు వడ్డె జగన్, కొంగర సుబ్బయ్య, మీగడ లింగరాజు, దొనకొండ రామకృష్ణ, ఆంజనేయులు, కణతాల వెంకటేశ్వర్లు, వడ్డె లక్ష్మయ్య, వడ్డె వెంకటేశ్వరరావు, బొడ్డు ఉపేందర్, బొడ్డు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment