ప్రైవేటుకే పంపిస్తాం.. సర్కార్ డబ్బులివ్వాల్సిందే
లిస్బాన్: పోర్చుగల్లో ప్రైవేటు పాఠశాలలకు మద్దతుగా భారీ ఉద్యమం మొదలైంది. ఇక నుంచి తాము పూర్తి స్థాయిలో నిధులు ప్రభుత్వ పాఠశాలలపైనే పెడతామని ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి ప్రజలు, విద్యార్థులు, ప్రైవేటు టీచర్లు వీధుల్లో పోరు బాట పట్టారు. దాదాపు 40వేలమంది పచ్చరంగు టీ షర్ట్స్ ధరించి డప్పులు వాయిస్తూ జాతీయ గీతం పాడుతూ లిస్బాన్లోని జులియో అమెన్యూ వద్దకు డీ.కార్లోస్ ప్రాంగాణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు పార్లమెంటుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమానికి డీఫెసా డా ఎస్కోలా పోంటో(డీఈపీ) నాయకత్వం వహిస్తోంది.
ప్రైవేటు స్కూళ్ల రక్షణే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటీవల విద్యావిధానం పై అన్ని రకాలుగా సమీక్ష నిర్వహించిన పోర్చుగల్ ప్రభుత్వం విద్యా ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించాలని, ప్రైవేటు స్కూళ్లో చదివే వారికి తాము నిధులు చెల్లించబోమని ప్రకటించింది. ఒక్క ప్రభుత్వ స్కూళ్ల ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యం అని చెప్పింది. ఈ ఒక్క ప్రకటనతో అనూహ్యంగా పలు ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతోపాటు విద్యార్థులు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో మాత్రమే ఒక ఒప్పందం ద్వారా చేరాలి అని విధించిన నిబంధన కూడా ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగించి ఉద్యమబాట పట్టారు.