కరెంటు లేకుంటే కాపురానికి రానే రాను... | powercut crisis in a family | Sakshi
Sakshi News home page

కరెంటు లేకుంటే కాపురానికి రానే రాను...

Published Sat, Apr 4 2015 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

కరెంటు లేకుంటే కాపురానికి రానే రాను...

కరెంటు లేకుంటే కాపురానికి రానే రాను...

పాట్నా: అత్తింటి ఆరళ్లకు తాళలేక మెట్టినిల్లు విడిచిపెట్టి పుట్టింటికి వచ్చే కోడళ్లను చూశాం. సులభ్ శానిటేషన్ చేపట్టిన సామాజిక ఉద్యమం కారణంగా మరుగు దొడ్లను నిర్మిస్తేగానీ అత్తింటిలో అడుగుపెట్టమంటూ శపథం చేస్తున్న నవతరం కోడళ్లను చూస్తున్నాం. కరెంటు కోతలున్నంతకాలం అత్తింటిలో అడుగుపెట్టనంటూ మొండికేసిన ఓ కోడలి ఉదంతాన్ని మొదటిసారి వింటున్నాం.

దళిత యువతి రేణు పాశ్వాన్ మూడేళ్ల కింద పాట్నా జిల్లాలోని బార్ని గ్రామానికి చెందిన శశిభూషణ్ పాశ్వాన్‌ను పెళ్లి చేసుకొంది. ఎన్నో ఆశల పల్లకిలో అత్తింట్లో అడుగుపెట్టింది. పుట్టింట్లో పంకా గాలి కింద పడుకునే అలవాటున్న రేణుకు కరెంటు కోత ఎక్కువగా ఉన్న అత్తింట్లో ఉక్కపోతకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు పుట్టింటికి పారిపోదామా అని చూస్తున్న ఆమె తొలిచూలు పేరుమీద పుట్టింటికి వెళ్లింది. కొడుకు పుట్టాక కూడా అత్తింటికి రావడానికి నిరాకరించింది. భర్త, బంధువులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు. దాదాపు రోజుకు పది గంటల కరెంటు కోత ఉండే ఆ ఊళ్లో ఒక్కరోజు కూడా తాను ఉండలేనని చెప్పింది. పైగా అత్తింటికి సమీపంలోనే కోళ్ల ఫారం ఉందని, పరిసర ప్రాంతాలు అనారోగ్యకరంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో తానుండడం, తన కొడుకును పెంచడం కుదరనే కుదరని మొండికేసింది. తొలి కానుపు బిడ్డ ఫంక్షన్ అత్తింట్లో జరుపుకోవడం ఆచారమంటూ బతిలాడి బామాలి రేణును అత్తింటి వాళ్లు తీసుకెళ్లారు. ఫంక్షన్ స్తోమతమేరకు ఘనంగానే జరిపారు. భార్యాభర్తలు కూడా ఆనందంగానే గడిపారు. ఫంక్షన్‌కు సంబంధించిన కార్యక్రమాలు ముగియగానే రేణు తన కొడుకుతోసహా పుట్టింటికి తిరిగి చెక్కేసింది.

ఈ విషయమై గత గురువారం ఇరు కుటుంబాల మధ్య మళ్లీ గొడవైంది. ఇక ఆమెకు నచ్చచెప్పడం సాధ్యంకాదని భావించిన భర్త శశిభూషణ్ సమీపంలోని ధనుర్వా పోలీసు స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్యాభర్తలు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి వాదనలు విన్నారు. సార్! ఒకప్పుడు మా ఊళ్లో కరెంటు ఎప్పుడొచ్చేదో, పోయేదో ఎవరికి తెలిసేది కాదు. ఇటీవలి కాలంలో కరెంటు పరిస్థితి బాగా మెరుగుపడింది. ఇప్పుడు పది, పదకొండు గంటలకు మించి కరెంటు పోవడం లేదు. రేణు తల్లిదండ్రులు నివసిస్తున్న పాట్నా శివారులోని మీఠాపూర్ ప్రాంతంలో మాత్రం కరెంటు పోవడం లేదా! మీరే న్యాయం చెప్పండి అంటూ పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. మా ఊళ్లో అంతసేపు కరెంటు పోదు. పోయినా త్వరగా వస్తుంది. ఆ ఊళ్లోలాగా గంటలు గంటలు పోనే పోదు. పైగా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవు. ఆక్కడ నా కొడుకు పెరగడం నాకిష్టం లేదు అంటూ రేణు తన వాదన వినిపించింది. చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఏమిటని భావించిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చ చెప్పేందుకు ఎంతో ఓపిగ్గా ప్రయత్నించి విఫలమయ్యారు. మీ తగాదా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రే తీర్చాలి. మావల్ల కాదు అంటూ పోలీసులు చేతులు దులుపుకున్నారు.

తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న బీహార్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపర్చేందుకు గత తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని చాలా గ్రామాలకు కరెంట్ కనెక్షన్లే లేవు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రామాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే ఓట్ల కోసం రానే రానంటూ నితీష్ కుమార్ శపథం చేసిన విషయం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement