జగన్ చెబుతున్నది మూడో ఫ్రంట్ కంటే ముఖ్యం | YS Jaganmohan Reddy receives Grand welcome in Patna | Sakshi
Sakshi News home page

జగన్ చెబుతున్నది మూడో ఫ్రంట్ కంటే ముఖ్యం

Published Sat, Dec 14 2013 2:35 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

జగన్ చెబుతున్నది మూడో ఫ్రంట్ కంటే ముఖ్యం - Sakshi

జగన్ చెబుతున్నది మూడో ఫ్రంట్ కంటే ముఖ్యం

 బీహార్ సీఎం నితీశ్‌కుమార్; పాట్నాలో జగన్‌కు ఘన స్వాగతం

 పాట్నా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చిన్నవాడైనా సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన బలమైన వాదనను తెర మీదకు తెచ్చారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కితాబిచ్చారు. మూడో ఫ్రంట్ కంటే జగన్ తెర మీదకు తెచ్చిన అంశం ముఖ్యమైందని, తీవ్రమైందని చెప్పారు. సాధారణ మెజారిటీతో రాష్ట్రాలు విభజించే విధానం గురించి దేశమంతా తీవ్రంగా ఆలోచించాల్సిందేనన్నారు. శుక్రవారం సాయంత్రం జగన్ తనను కలిసి వెళ్లిపోయిన తర్వాత నితీశ్‌కుమార్ కాసేపు విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడారు. తనకు వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ మరణించినప్పుడు బీహార్‌లో రెండురోజులు సంతాప దినాలుగా పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు జగన్ పక్షాన ఉన్నారని, ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ.. తనకున్న సమాచారాన్ని విలేకరుల ముందుంచారు. మూడో ఫ్రంట్ గురించి ఎన్నికల తర్వాత చర్చించాలని, ఇప్పుడు సమయం కాదని చెప్పారు.


 జగన్‌ను రాష్ట్ర అతిథిగా పరిగణించిన బీహార్ సర్కార్


 నితీశ్‌తో భేటీ కావడానికి వచ్చిన జగన్‌కు పాట్నా విమానాశ్రయంలో బీహార్ అధికార పార్టీ జేడీ(యూ) ఎంపీ అలీ అన్వర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఘన స్వాగతం పలికింది. బీహార్ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర అతిథి (స్టేట్ గెస్ట్)గా పరిగణించింది. ఈమేరకు అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పించింది. మరోవైపు జగన్‌ను స్వాగతిస్తూ పాట్నా తెలుగు అసోసియేషన్ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. దాదాపు 200 మంది తెలుగువారు విమానాశ్రయంలో జగన్‌కు పుష్పగుచ్ఛాలందజేశారు. జై సమైక్యాంధ్ర, జైజగన్ అంటూ నినాదాలు చేశారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నమే జగన్ ఇక్కడికి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో సాయంత్రం 6.30 గంటలకు వచ్చారు. తెలుగువారంతా ఆయన వచ్చేవరకు విమానాశ్రయంలో నిరీక్షించారు. స్వాగతం పలికినవారిలో వాసు, గౌరు సుబ్బారెడ్డి, రాజు, వెంకటరెడ్డి, సుధ తదితరులు ఉన్నారు. నితీశ్‌తో భేటీ తర్వాత విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే జగన్ విమానాశ్రయానికి వెళ్లిపోయారు. నితీశ్ జగన్‌కు కారు వద్దకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. జగన్ అంతకుముందు తన నివాసానికి చేరుకున్నప్పుడు కూడా కారు వద్దకు ఎదురొచ్చి మరీ బీహార్ సీఎం స్వాగతం పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement