మహిమగలది అంటూ నిందితులు మహిళకు అంటగట్టిన చెంబు ఇదే.
ఎస్.కోట: ఫొటోలో కనిపిస్తోందే.. అదొక మహిమగల చెంబట! దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడెక్కడి సొమ్మంతా మన ఇంట్లోకి వచ్చి పడుతుందట! 'ఎలా వస్తాయి? డబ్బులేమైనా సెల్ ఫోన్ సిగ్నల్సా.. గాలిలో వచ్చేయడానికి?' అని మీకు సందేహం రావచ్చు. కానీ అది నిజమని నమ్మి, ఆ మహిమగల చెంబును దక్కించుకునేందుకు లక్షలు ఇచ్చేస్తుంటారు కొందరు. చివరికి తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఆశ్రయిస్తారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో సోమవారం వెలుగులోకి వచ్చిన సంఘటనా ఇలాంటిదే. పోలీసులు తెలిపిన వివరాలను బట్టి..
ఎస్.కోటకు చెందిన ఓ మహిళను సంప్రదించిన నిందితులు తమ దగ్గర మహిమగల చెంబు ఉన్నదని నమ్మించి రూ. 15 లక్షలు కాజేసి ఉడాయించారు. తీరా ఆ చెంబు సాధారణ చెంబేనని తెలుసుకుని, మోసపోయానని గ్రహించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.