సాక్షి, హైదరాబాద్ : ‘మీకు సినీ, టీవీ నటులతో గడపాలని ఉందా..? నాకు తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులెందరో తెలుసు.. అడ్వాన్స్ చెల్లిస్తే వారి ఫోన్ నంబర్లు ఇచ్చి వారితో నేరుగా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తా.. కొత్త హీరోయిన్‌లు అయితే రూ.3 లక్షలు, పాత హీరోయిన్లకు రూ.2 లక్షలు..’ వాట్సాప్‌లో ఓ మాయలేడి పంపిన మెసేజ్ ఇదీ! ఈ మోసగత్తె ఉచ్చులో చిక్కి పలువురు రాజకీయ నాయకులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, యువకులు మోసపోతున్నారు.
బంజారాహిల్స్‌కు చెందిన 23 ఏళ్ల ప్రశాంత్ వాట్సాప్‌లో వచ్చిన ఇలాంటి సందేశానికి ఆకర్షి తుడై రూ.25 వేలు వదులుకున్నాడు. రాజధాని నగరానికే చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడు, కాంగ్రెస్ యువనేతదీ ఇదే పరిస్థితి! మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న 24 సంవత్సరాల సందీప్ రెండు నెలల జీతం పోగొట్టుకుని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపో యాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువనేత రూ. లక్ష చేజార్చుకున్నాడు! సల్మా లక్ష్మిగా చెప్పుకుంటున్న ఓ మహిళ వీరందరినీ బురిడీ కొట్టించింది. తెలుగు, తమిళ్, హిందీ హీరోయిన్లు, టీవీ ఆర్టిస్ట్‌లను సరఫరా చేస్తానంటూ మార్ఫింగ్ చేసిన వారి ఫోటోలతో సహా యువకులకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతూ భారీగా డబ్బులు గుంజింది.
చిత్రమేమంటే ఆ మాయలేడి వలలో పడ్డవారెవ్వరూ ఇప్పటిదాకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబ గౌరవం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని సల్మా మరింత రెచ్చిపోయింది. కొందరు ఏజెంట్లను నియమించుకుని మరీ యువ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, యువ రాజకీయ నేతల మొబైల్ నంబర్లను సేకరించి వారికి గాలం వేస్తోంది. ‘‘ఓ యువనేత నాతో ఫోన్‌లో ఈ విషయం చెప్పారు. మీరు ఫిర్యాదు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. కానీ ఆయన ముందుకురాలేదు. దీంతో ఆయనను సంప్రదించి మేమే మోసగత్తెకు సంబంధించిన వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
ఫోన్ సంభాషణ రికార్డులు పంపి..
సల్మా లక్ష్మిగా చెప్పుకుంటున్న మహిళ తాను ముంబై వాసినని, తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులు తనకు తెలుసునని పరిచయం చేసుకుంటోంది. నటీమణులతో శారీరక సంబంధాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తానని నమ్మబలుకుతోంది. ఏ మాత్రం అనుమానం రాకుండా వారికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి యువకులకు వాట్సాప్ ద్వారా చేరవేస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లోని అన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లలో తనకున్న ప్రత్యేక గదుల్లో కాల్‌గరŠల్స్ ఉన్నారంటూ ఆ సందేశాల్లో పేర్కొంటోంది. ముందస్తుగా అడ్వాన్స్ సొమ్ము చెల్లిస్తే సదరు సినిమా, బుల్లితెర నటీమణుల ఫోన్ నంబర్లు ఇచ్చి వారితో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తానని చెబుతోంది. కొత్త హీరోయిన్‌కు రూ.3 లక్షలు, పాత హీరోయిన్లకు రూ.2 లక్షలు చెల్లించాలంటూ, అందుకు తగ్గట్లుగా ఇద్దరు హీరోయిన్లుగా చెప్పుకుంటున్న వారితో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డులను కూడా వాట్సాప్‌లో పంపుతోంది.
ఇవన్నీ చూసి నిజమేనని నమ్మిన ప్రశాంత్ (బ్యాంక్ ఉద్యోగి) తనకు బాగా ఇష్టమైన ఓ తెలుగు నటీమణితో పరిచయం కావాలని సల్మాకు మెసేజ్ పెట్టాడు. అందుకు ‘అదేం పెద్ద కష్టం కాదు.. రూ.25 వేలు పేటీఎం ద్వారా చెల్లించండి’ అని సూచించిన సల్మా... ఓ మొబైల్ నంబర్ ఇచ్చింది. దీంతో ప్రశాంత్ 24 గంటల్లో ఐదుసార్లు రూ.5 వేల చొప్పున రూ.25 వేలు చెల్లించాడు. డబ్బు చేరగానే ఆ మాయలేడి ప్రశాంత్ నంబర్‌ను బ్లాక్ చేసింది. మోసపోయానని తెలుసుకున్న ప్రశాంత్ మౌనంగా ఉండిపోయాడు. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఓ యువనేత కూడా తనకు వచ్చిన వాట్సాప్ సందేశంతో సల్మాతో చాటింగ్ చేశాడు. ఆమె మాటలు నమ్మి ఓ హీరోయిన్‌తో పరిచయం కోసం తాపత్రయపడ్డాడు. ముందస్తుగా రూ.50 వేలు చెల్లించడానికి సిద్ధపడ్డాడు. సల్మా చెప్పిన మొబైల్ నంబర్ ద్వారా ఎయిర్‌టెల్ మనీ చెరవేశాడు. అంతే మరుసటి రోజు నుంచి ఆ యువనేత నంబర్‌ను బ్లాక్ చేసింది. తాను ముంబైలో ఉంటానని చెప్పుకుంటున్నా.. ఈ మాయలేడి ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.
తప్పుడు నంబర్లు ఇస్తూ..
ఈ మాయలాడి ఫలానా హీరోయిన్ లేదా ఫలానా బుల్లితెర నటీమణి ఫోన్ నంబర్ అంటూ తప్పుడు నంబర్లు ఇస్తూ కూడా మోసాలకు పాల్పడుతోంది. సల్మా ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి చీవాట్లు ఎదురవుతున్నాయి. ఆ ఫోన్ నంబర్లన్నీ మహిళలవే కావడం గమనార్హం.
మోసపోవద్దనే ఉద్దేశంతోనే ఈ కథనం
సల్మా మోసాలను ‘సాక్షి’ ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చిన ఓ రాజకీయ యువనేత తన పేరు రహస్యంగా ఉంచాలని కోరారు. సల్మా మోసాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడంతోపాటు కొందరు బాధితుల వివరాలు కూడా అందించారు. వీరి మాదిరిగా మరెవ్వరూ మోసపోవద్దనే ఉద్దేశంతోనే ‘సాక్షి’ ఈ కథనాన్ని ప్రచురిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment