విజయదుర్గమ్మా..... వానలు కురిపించవమ్మా..
– ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
– కదిలివచ్చిన భక్తజనం
కడప కల్చరల్ :
మాతా నమోస్తుతే....తల్లీ విజయదుర్గమ్మా.. నిండుగా వానలు కురిపించవమ్మా....మా జిల్లా పచ్చగా ఉండేటట్లు దీవించవమ్మా....సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా చూడుతల్లీ అంటూ భక్తులు శ్రీ విజయ దుర్గామాతను కోరుకున్నారు. అమ్మవారిని స్తుతిస్తూ నినాదాలు చేశారు. మంగళవారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు గల 108 కలశాలతో అభిషేకించారు. 41 రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాలలోగల దేవాలయాలలో ఈ కలశాలను ఉంచి పూజలు నిర్వహించారు. అభిషేకం సందర్భంగా ఆయా మండలాలకు చెందిన భక్తులు ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ ఆటోలలో ఆ పవిత్ర కలశాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకొచ్చారు. జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మవారిని స్వయంగా అభిషేకించారు. బారులు తీరి వేచి ఉండి మరీ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ వేద పండితులు రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మలు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కలెక్టర్ పూజలు..
జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ మంగళవారం శ్రీ విజయదుర్గాదేవిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి విశేష వస్త్రాలను, చిత్రపటాన్ని, గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన విజయదుర్గ కార్డియాలజీ సెంటర్ వైద్యులు ప్రత్యేకంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.