Published
Mon, Sep 19 2016 11:04 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
2 లక్షల మంది క్రైస్తవులతో ప్రార్థన
నల్లగొండ టూటౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ డిసెంబర్‌లో 2లక్షల మంది క్రైస్తవులతో ఒకేసారి ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ బి.రాజేశ్వర్‌రావు అన్నారు. సోమవారం స్థానిక రత్న ఫంక్షన్‌హాలులో క్రైస్తవ ప్రముఖులు, చర్చి ఫాదర్‌లతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల పండుగలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్‌నని అన్నారు. క్రైస్తవుల పిల్లల చదువులకు, ఉపకార వేతనాలు మంజూరు చేసి ఉన్నత చదువుల కోసం కృషి చేశారని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉండేందుకు సీఎం నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. విలేకరుల సమావేశంలో రేఖల భద్రాద్రి, తీగల జాన్‌శాస్త్రీ, పాల్, ఏసురాజు, జోసఫ్, పోకల అశోక్, వేణుగోపాల్, ప్రభాకర్ తదితరులున్నారు.