A FOR అంగన్‌వాడీ!
పాలకోడేరు : ఇప్పటివరకూ ప్రీస్కూల్‌కే పరిమితమైన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇకపై ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించింది. ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభించాలని నిర్ణయించింది. రెండు మూడురోజుల్లో తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. జిల్లాలో మొత్తం 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 3,569 అంగన్‌వాడీ కేంద్రాలు, 322 మినీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం రెండు లక్షల 48వేల మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ప్రీస్కూల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. పోషకాహారం అందిస్తున్నారు.
కారణమేంటంటే !
ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లల చదువుపై అమిత శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లు రాగానే ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేస్తున్నారు. ఐదేళ్లు వచ్చే సరికి వారికి ఎల్‌కేజీ, యూకేజీ పూర్తయిపోతున్నాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాలని తలంచినట్టు అధికారులు చెబుతున్నారు. తొలుత ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మూడు కేంద్రాలు ఒకేచోట
ప్రస్తుతం కిలోమీటర్ పరిధిలోపు ఉన్న మూడు అంగన్‌వాడీ కేంద్రాలను ఒకచోట చేర్చి తరగతులను ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే వార్డుల వారీగా ఉన్న కేంద్రాల సంఖ్య, చిన్నారుల సంఖ్యతో అధికారులు నివేదిక తయారు చేశారు. వయస్సు, విద్యార్హతను బట్టి పిల్లలకు బోధించేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలను కేటాయించనున్నారు. మూడు కేంద్రాలను ఓ చోట చేరిస్తే శివారు గ్రామాల్లో ఉన్న కేంద్రాలు మూతపడతాయన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అలాంటిదేమీ ఉండదని, కేవలం, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉన్న వాటినే ఒకచోట చేరుస్తామని, శివారు గ్రామాల్లో ఉన్న కేంద్రాలను అలాగే ఉంచి ప్రధాన గ్రామాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నారు.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు
జిల్లాలో ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు ఇప్పటికే అధికారులు పైలట్ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. కొన్ని మండల కేంద్రాలతోపాటు, మున్సిపాలిటీల్లో వాటిని ప్రారంభించారు.
సిలబస్ ఏంటంటే..
ఏబీసీడీలతో పాటు, చిన్నచిన్న పదాలు, బొమ్మల గుర్తింపు, రెయిమ్స్‌తో కూడిన వర్క్‌బుక్‌లను అధికారులు రూపొందించారు. వీటితో బోధన చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఐదేళ్లు పూర్తిచేసుకున్న పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించే ముందు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.
అడ్మిషన్లకు సిద్ధం
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తరగతుల నిర్వహణకు సీడీపీవోలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అంగన్‌వాడీ పిలుస్తోంది పేరుతో పిల్లలను చేర్చుకుంటున్నారు. ఆదేశాలు రాగానే మరోవిడత ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కార్యకర్తలకు బోధనా సామర్థ్యం ఉందా!
అసలు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు పాఠాలను బోధించే సామర్థ్యం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉందా అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి అంగన్‌వాడీ కార్యకర్తలకు పదో తరగతి విద్యార్హత ఉండాలి. కొన్నిచోట్ల పదో తరగతి ఉత్తీర్ణులు కాని వారినీ కార్యకర్తలుగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల విద్య ప్రవేశపెడితే పిల్లలకు వారు బోధించగలరో.. లేదోననే సందిగ్ధం నెలకొంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే కార్యకర్తల్లో కొందరు డిగ్రీ వరకూ చదువుకున్నవారు ఉన్నారని, పదోతరగతి చదువుకున్న వారికి గతంలో బోధనలో శిక్షణ ఇచ్చామని చెబుతున్నారు.
కష్టపడి బోధిస్తాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమే. కష్టపడి బోధించడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మా గౌరవం మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.
- విజయలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్, గొల్లలకోడేరు
పేదలకు వరం
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రవేశపెడితే మాలాంటి పేదలకు వరం. ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంగన్‌వాడీల్లో ఉచితంగా విద్యనందిస్తే మంచిదే. మా బిడ్డలను చేర్పిస్తాం. వెంటనే తరగతులు ప్రారంభించాలి.
- కె.సింహాచలం, ఓ చిన్నారి తల్లి, గొల్లలకోడేరు
ఆదేశాలు రావాల్సి ఉంది
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు ఆదేశాలు రావాల్సి ఉంది. నివేదికలు తయారు చేసి ఉంచుకున్నాం. ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలో ఆదేశాలు రావచ్చు.
- జి.చంద్రశేఖర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్, ఏలూరు