Pilot projects
-
డిజిటల్‌గా కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
న్యూఢిల్లీ: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్‌గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి. ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్)తో జట్టు కట్టాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే పొలం వెరిఫికేషన్ కూడా జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు. -
సైకిల్‌వాలా జిందాబాద్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోన్లో ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపట్టిన ‘ఇండియా సైకిల్ 4 చేంజ్ చాలెంజ్ (సీ4సీ చాలెంజ్)’ అమలు చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీస్‌గా సీ4సీ చాలెంజ్‌కు నమోదైన 95 నగరాల్లో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజల్లో సైకిల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని అనువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) పూర్తి స్థాయిలో తగిన సాంకేతిక సహకారం, సలహాలు అందిస్తాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత ఖైరతాబాద్ జోన్లో అమలు చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా, జీహెచ్ఎంసీలు నిర్ణయించాయి. అందుకుగాను ఆ విభాగాల అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జోన్‌లోని 23 కి.మీ.ల పొడవునా(రెండు వైపులా వెరసి 46 కి.మీ.) ఏడు సైకిల్ ట్రాక్‌ల మార్గాల్ని గుర్తించారు. తొలిదశలో పది కి.మీ.ల మేర అమలు చేస్తారు. ఎదురయ్యే సాధకబాధకాలు, ప్రజల స్పందన, ఫలితాన్ని బట్టి మిగతా మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. సైకిల్‌ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రాంతాల్లో తగిన సైనేజీలు, రోడ్మార్కింగ్లు, బారికేడింగ్, ప్లగ్ ప్లే బొల్లార్డ్ వంటివి ఏర్పాటు చేస్తారు. సైక్లిస్టుల భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందజేస్తారు. దశలవారీగా 450 కి.మీ.ల మేర.. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో రైలు స్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినళ్లు, డిపోలు,ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పబ్లిక్ బైసికిల్ షేరింగ్ డాక్స్ (పీబీఎస్) ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో దశలవారీగా సైబరాబాద్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, మెహదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో 450 కి.మీ.ల మేర సైకిల్మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్ ప్రయాణం మేలని, అందుకు తగిన మార్గాలు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. చాలెంజ్.. రెండు దశల్లో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీ4సీ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో పైలట్‌గా సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటివి ఉంటాయి. మొదటి దశకు అక్టోబర్ 14 చివరి తేదీ. దీనికి సంబంధించి 95 నగరాల నుంచి అందిన ప్రణాళికలు, అమలు, వ్యూహాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండో దశకు 11 నగరాలను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 28 వరకు ఈ ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన నగరాలకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ కోటి రూపాయలు చొప్పున అవార్డుగా అందజేస్తుంది. ఎంపికైన నగరాలకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తగిన సలహాలిస్తారు. రెండో దశ సైకిల్నెట్వర్క్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు పూర్తికాగలదని భావిస్తున్నారు. -
ఇకపై కాగిత రహిత విధానంలోకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో నిత్యం జరిగే ఉత్తరప్రత్యుత్తరాలను కాగిత రహిత (పేపర్‌లెస్) విధానంలోకి తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారు లు చర్యలు చేపట్టారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా యావ త్ పోలీస్ శాఖను ఆధునీకరిస్తున్న అధికారులు తాజా గా ఈ–ఆఫీస్ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా పలు జిల్లాలు, కమిషనరేట్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ–ఆఫీస్ విధానం విజయవంతం కావడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో దీన్ని అమల్లోకి తీసుకురావాలని అడ్మిన్ విభాగాల బాధ్యులకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. డీఎస్ఆర్ నుంచి బడ్జెట్ ప్రతిపాదనల వరకు పోలీస్‌శాఖలో శాంతిభద్రతల విభాగాలపై నిత్యం సబ్ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి నుంచి డీజీపీ వరకు ఉదయమే సమీక్ష జరుగుతుంది. నిన్న ఏం జరిగింది, నేడు చర్యలు ఏం తీసుకోవాలన్న డీఎస్ఆర్ (డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్)పై టెలి కాన్ఫరెన్స్, అవసరమైతే కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఆయా జిల్లాల ఎస్పీలు, డీజీపీ నిర్వహిస్తారు. ఇప్పటివరకు డీఎస్ఆర్లు కేవలం పేపర్లపై ప్రింట్ రూపంలో ఉన్నతాధికారులకు చేరేవి. ఇకపై అలా కాకుండా ప్రతీ పోలీస్‌స్టేషన్ నుంచి ట్యాబ్‌ల ద్వారా ఆయా సర్కిల్, సబ్‌డివిజినల్, జిల్లా ఎస్పీ, డీఐజీ, ఐజీ, డీజీపీ వరకు ఆన్లైన్లో ఈ–ఆఫీస్ టూల్స్ ద్వారా క్షణాల్లో చేరిపోతాయి. కీలక కేసుల వివరా లు, క్రైమ్ డైరీ ఫైల్స్, చార్జిషీట్లు ఈ–ఆఫీస్ ద్వారానే పంపేందుకు పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్, సిద్దిపేట కమిషనరేట్లతో పాటు నాగర్‌కర్నూల్, కామారెడ్డి, టీఎస్ఎస్పీ (తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్), గ్రేహౌండ్స్ విభాగాల్లో ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమవడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉపయోగించేలా చర్యలు తీసుకోబోతున్నారు. -
A FOR అంగన్వాడీ!
పాలకోడేరు : ఇప్పటివరకూ ప్రీస్కూల్కే పరిమితమైన అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించింది. ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించాలని నిర్ణయించింది. రెండు మూడురోజుల్లో తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. జిల్లాలో మొత్తం 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 3,569 అంగన్వాడీ కేంద్రాలు, 322 మినీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం రెండు లక్షల 48వేల మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ప్రీస్కూల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. పోషకాహారం అందిస్తున్నారు. కారణమేంటంటే ! ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లల చదువుపై అమిత శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లు రాగానే ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేస్తున్నారు. ఐదేళ్లు వచ్చే సరికి వారికి ఎల్కేజీ, యూకేజీ పూర్తయిపోతున్నాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాలని తలంచినట్టు అధికారులు చెబుతున్నారు. తొలుత ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు కేంద్రాలు ఒకేచోట ప్రస్తుతం కిలోమీటర్ పరిధిలోపు ఉన్న మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకచోట చేర్చి తరగతులను ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే వార్డుల వారీగా ఉన్న కేంద్రాల సంఖ్య, చిన్నారుల సంఖ్యతో అధికారులు నివేదిక తయారు చేశారు. వయస్సు, విద్యార్హతను బట్టి పిల్లలకు బోధించేందుకు అంగన్వాడీ కార్యకర్తలను కేటాయించనున్నారు. మూడు కేంద్రాలను ఓ చోట చేరిస్తే శివారు గ్రామాల్లో ఉన్న కేంద్రాలు మూతపడతాయన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అలాంటిదేమీ ఉండదని, కేవలం, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉన్న వాటినే ఒకచోట చేరుస్తామని, శివారు గ్రామాల్లో ఉన్న కేంద్రాలను అలాగే ఉంచి ప్రధాన గ్రామాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు జిల్లాలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు ఇప్పటికే అధికారులు పైలట్ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. కొన్ని మండల కేంద్రాలతోపాటు, మున్సిపాలిటీల్లో వాటిని ప్రారంభించారు. సిలబస్ ఏంటంటే.. ఏబీసీడీలతో పాటు, చిన్నచిన్న పదాలు, బొమ్మల గుర్తింపు, రెయిమ్స్తో కూడిన వర్క్‌బుక్‌లను అధికారులు రూపొందించారు. వీటితో బోధన చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఐదేళ్లు పూర్తిచేసుకున్న పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించే ముందు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. అడ్మిషన్లకు సిద్ధం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తరగతుల నిర్వహణకు సీడీపీవోలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అంగన్వాడీ పిలుస్తోంది పేరుతో పిల్లలను చేర్చుకుంటున్నారు. ఆదేశాలు రాగానే మరోవిడత ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కార్యకర్తలకు బోధనా సామర్థ్యం ఉందా! అసలు ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు పాఠాలను బోధించే సామర్థ్యం అంగన్వాడీ కార్యకర్తలకు ఉందా అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి అంగన్వాడీ కార్యకర్తలకు పదో తరగతి విద్యార్హత ఉండాలి. కొన్నిచోట్ల పదో తరగతి ఉత్తీర్ణులు కాని వారినీ కార్యకర్తలుగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల విద్య ప్రవేశపెడితే పిల్లలకు వారు బోధించగలరో.. లేదోననే సందిగ్ధం నెలకొంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే కార్యకర్తల్లో కొందరు డిగ్రీ వరకూ చదువుకున్నవారు ఉన్నారని, పదోతరగతి చదువుకున్న వారికి గతంలో బోధనలో శిక్షణ ఇచ్చామని చెబుతున్నారు. కష్టపడి బోధిస్తాం అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమే. కష్టపడి బోధించడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మా గౌరవం మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. - విజయలక్ష్మి, అంగన్వాడీ వర్కర్, గొల్లలకోడేరు పేదలకు వరం అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రవేశపెడితే మాలాంటి పేదలకు వరం. ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంగన్వాడీల్లో ఉచితంగా విద్యనందిస్తే మంచిదే. మా బిడ్డలను చేర్పిస్తాం. వెంటనే తరగతులు ప్రారంభించాలి. - కె.సింహాచలం, ఓ చిన్నారి తల్లి, గొల్లలకోడేరు ఆదేశాలు రావాల్సి ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు ఆదేశాలు రావాల్సి ఉంది. నివేదికలు తయారు చేసి ఉంచుకున్నాం. ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలో ఆదేశాలు రావచ్చు. - జి.చంద్రశేఖర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్, ఏలూరు -
జైళ్లలో మెనూ మార్పు
యలమంచిలి : రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షఅనుభవిస్తున్న, రిమాండ్ ఖైదీలకు శుభవార్త. వారి మెనూ మార్పు చేస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. పెలైట్ ప్రాజెక్టుగా నెల రోజుల పాటు జిల్లా కేంద్ర కారాగారాలు, ఉపకారాగారాల్లో ఇప్పటి వరకు అమలు చేస్తున్న మెనూలో పలుమార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది విజయవంతమైతే వచ్చే ఏడాది నుంచి మారిన మెనూను అమలు చేస్తారు. దీనిపై యలమంచిలి సబ్‌జైల్ సూపరింటెండెంట్ పి.సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఖైదీలకు పప్పుదినుసులను మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దీనికి అదనంగా ఆకుకూరలతో కూడిన పప్పునుఅందించనున్నారు. ఉదయం అల్పాహారంలో ఇప్పటి వరకు పులిహోరను రోజూ ఇస్తున్నారు. మార్పు చేసిన మెనూలో ఉదయం అల్పాహారం జాబితాలో పొంగలి, చపాతి, ఉప్మా, పులిహోర పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రతీ శనివారం అరటిపండు, మంగళ, శుక్రవారాల్లో కోడిగుడ్డు, శాకాహారులకు అరటిపండు, నెలలో మొదటి ఆదివారం మటన్, మిగతా ఆదివారాలు చికెన్‌తో కూడిన కూరలు ఖైదీలకు పెడతారు. ఈ మేరకు అన్ని జైళ్లకు సమాచారం అందింది. దీని ప్రకారం బుధవారం నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు పెలైట్ ప్రాజెక్టుగా మారిన కొత్త మెనూను అమలు చేయనున్నట్టు జైళ్ల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పు పట్ల ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.