అనధికారులకు అగ్రతాంబూలం!
అనధికారులకు అగ్రతాంబూలం!
Published Mon, Jun 19 2017 12:00 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
- మంత్రుల సమీక్షలో ప్రొటోకాల్‌కు పాతర
– చైర్‌పర్సన్‌కు అందని ఆహ్వానం
– టీడీపీ అభ్యర్థికి, కార్యకర్తలకు అగ్రస్థానం
నంద్యాల : అధికారికంగా మంత్రులు నిర్వహించిన సమీక్షలో అనధికారులకు అగ్రతాంబూలమిచ్చి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి పార్టీ సమావేశంగా మార్చేశారు అధికారపార్టీ నేతలు. ఆదివారం స్థానిక సూరజ్‌గ్రాండ్ హోటల్‌లో మంత్రులు నారాయణ,అఖిలప్రియ అధికారులు,డ్వాక్రా మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచనకు పిలుపులేదు. కానీ ఎటువంటి హోదా లేని భూమా బ్రహ్మానంద రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలాగే కార్యకర్తలను ముందువరసలో కూర్చోబెట్టి డ్వాక్రా మహిళలు, అధికారులకు వెనుక వరుసలో సీట్లు కేటాయించారు. సీఎం 21వ తేదీన నంద్యాలలో పర్యటించనుండటం, నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పేరు ఖరారు చేయడంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ఆదివారం తెల్లవారుజామునే అభివృద్ధి పనులను,సమస్యలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్,రోడ్డు భవనాల శాఖ, మున్సిపల్ ఉపాధ్యాయుల సంఘాలు, డ్వాక్రా మహిళలతో సమావేశం చేపట్టారు.
ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులు :
మంత్రుల సమీక్షలో అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించారు. దేశం సులోచన పార్టీ మారడంతో ఆమెను పక్కన పెట్టారు. ఆమె వర్గానికి చెందిన కౌన్సిలర్లకు కూడా సమాచారాన్ని పంపలేదు. సమావేశంలో పార్టీ నాయకులే ముందు వరుసలో కూర్చోవడంతో అధికారులు, డ్వాక్రా మహిళలకు చోటులేకపోవడంతో వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది.
Advertisement