సర్వం సిద్ధం
♦ వరంగల్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: భన్వర్‌లాల్
♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
♦ మొత్తం 10 వేల మందితో భద్రతా ఏర్పాట్లు
♦ విధుల్లో 8,160 మంది పోలింగ్ సిబ్బంది
♦1,778 పోలింగ్ కేంద్రాల్లో 498 అత్యంత సమస్యాత్మకం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 5 గంటలకల్లా క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టామన్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలతోపాటు మొత్తం 10 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు.
నక్సలైట్ల ప్రాబల్యమున్న భూపాలపల్లి నియోజకవర్గంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. 8,160 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారని.. వారు ఇప్పటికే అన్ని కేంద్రాలకు తరలివెళ్లినట్లు చెప్పారు. 632 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలిస్తారన్నారు. 626 పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఇందుకు 476 మంది వీడియోగ్రాఫర్లు, 824 మంది విద్యార్థులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 96.01 శాతం మందికి ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు చెప్పారు. గత సాధారణ ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గంలో 76.15 శాతం పోలింగ్ నమోదైందని.. ఈసారి అంతకు మించి ఓటింగ్ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద టార్పాలిన్లు, టెంట్లు అందుబాటులో ఉంచుతామన్నారు.
మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా వీటిలో 498 కేంద్రాలను అత్యంత సమస్మాత్మకమైనవి, 642 సమస్యాత్మకమైనవి, 605 సాధారణ కేంద్రాలు, 33 నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతంలో ఉన్నవిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి
నగదు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని భన్వర్‌లాల్ కోరారు. టోల్‌ఫ్రీ నంబరు 180042522747కు ఫోన్ చేయాలని, లేదా 8790499899కు ఎస్‌ఎంఎస్ పంపించాలని సూచించారు. ఇప్పటివరకు తమకందిన ఫిర్యాదుల ఆధారంగా రూ.1.88 కోట్ల నగదు, ఒక మారుతీ కారు, 5,035 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని, అలాంటి ఎస్‌ఎంఎస్‌లుంటే 9491089257కు పంపించాలని కోరారు. పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు.