గ్రామీణులకు డబ్బు అందించండి
విజయవాడ : గ్రామీణ ప్రజల నగదు అవసరాలను తక్షణమే తీర్చాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ బ్యాంకర్లను, అధికారులను ఆదేశించారు. నగరంలో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శనివారం బ్యాంకర్లు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు రు. 306 కోట్ల నగదు రిజర్వ్‌బ్యాంకు నుంచి సరఫరా అయిందని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి బ్రాంచికి రూ. 25లక్షల నగదు సరఫరా చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా డబ్బు అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. అన్ని బ్యాంకులలో నగదు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడా క్యూలైన్లు కనపడకుండా బ్యాంకు అధికారులు నగదు పంపిణీ చేయాలన్నారు. రు. 500నోట్లను ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లకు అందిచాలని సూచించారు. పింఛన్లు, ఉపాధిహామీ కూలీల వేతనాలు ఎటువంటి ఆటంకం లేకుండా బిజినెస్ కరస్పాండెంట్లు డబ్బు అందిస్తారని చెప్పారు. బ్యాంకర్లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం సెలవుదినంగా భావించకుండా పని చేయాలని ఆదేశించారు.
21, 22 తేదీల్లో సీఎం కాన్ఫరెన్స్
ఈనెల 21, 22 తేదీలలో నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లాలో లైజన్ ఆఫీసర్లు, ప్రోటోకాల్, సిట్టంగ్ తదితర ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.