- బ్యాంకర్ల అంచనా
- ఖరారు కాని తుది జాబితా
- గడువు కోరిన బ్యాంకర్లు
- 3 లోగా అందించాలని కలెక్టర్ ఆదేశం
- అధికారులతో సమీక్ష
కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లాలో మాఫీ అయ్యే రైతుల రుణాలు సుమారు రూ.1800 కోట్లుగా అంచనా. తుది జాబితా ఇంకా ఖరారు కాకున్నా ప్రాథమికంగా రూపొందించిన లెక్కలు దీన్ని స్పష్టంచేస్తున్నాయి. ఆదివారంలోగా జిల్లాలో అర్హుల జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నా.. సామాజిక తనిఖీ సభల నిర్వహణలో ఆలస్యం, ఇతర కారణాలతో ఖరారు కాలేదు. అర్హులను తేల్చేందుకు తమకు మరికొంత సమయం కావాలని బ్యాంకులు కోరడంతో మూడు రోజుల్లోగా తుది నివేదిక అందించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు.
ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హుల జాబితాను రూపొందించాలని బ్యాంకులను, అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మండలానికో బ్యాంకు మేనేజర్‌ను బాధ్యుడిగా కమిటీలు వేశారు. ఈ మేరకు తమ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల జాబితాలను బ్యాంకులు రూపొందించాయి. ఆగస్టు 27 నుంచి 30 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ పేరిట రైతుల జాబితాను చదివి వినిపించారు. తమ పేర్లు జాబితాలో లేవని చాలా చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరికొన్ని చోట్ల గుంట భూమిలేనివారి పేరిట కూడా రుణాలు ఇచ్చినట్లు తేలింది.
కొందరు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు ఉన్నారు. వీరి గుర్తింపు కష్టంగా మారింది. దీంతో ఆదివారంలోగా తుదిజాబితా రూపొందించాల్సి ఉన్నా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయాధికారులతో కలెక్టర్ వీరబ్రహ్మయ్య సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అర్హుల జాబితా రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వేర్వేరు చోట్ల రుణాలు తీసుకున్న వారిని గుర్తించడం కష్టమవుతోందని, తుదిజాబితాకు కొంత గడువు కావాలని బ్యాంకర్లు కలెక్టర్‌ను కోరారు. దీంతో మూడు రోజుల్లోగా జాబితా అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
సెప్టెంబర్ 3న నిర్వహించనున్న బ్యాంకర్ల సమావేశంలో జిల్లాలో రుణమాఫీకి అర్హులైన తుదిజాబితాను ఆమోదించి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. మొదట వ్యవసాయ రుణాలపైనే దృష్టిసారించాలని సూచించారు. 2014 మార్చి 31 వరకు గల రుణాల్లో రూ.లక్ష వరకు మాఫీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 4,76,717 మంది రైతులకు రూ.2,505.66 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు జాబితా రూపకల్పనలో భాగంగా రూ.1,800 కోట్లు రుణమాఫీ అవుతాయని అంచనా వేసినట్లు వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు చెబుతున్నారు.
సామాజిక తనిఖీలు పూర్తి : కలెక్టర్
జిల్లాలో అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, బ్యాంకర్లతో సమీక్షించారు. రుణమాఫీకి ఏబీసీడీ జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. తుదిజాబితా(ఇ) సిద్ధం చేయాల్సి ఉందని, బ్యాంకర్ల కోరిక మేరకు ఈ నెల 3లోగా తుదిజాబితాకు అవకాశమిచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, బ్యాంకు సిబ్బంది సమన్వయంతో సమస్యను అధిగమించాలన్నారు. బ్యాంకు మేనేజర్, ప్రత్యేకాధికారి, కన్వీనర్, తహశీల్దార్, ఎంపీడీవో తప్పనిసరిగా సంతకం చేసి జాబితాను బ్యాంకు కంట్రోలర్‌లకు, ఎల్‌డీఎంకు, వ్యవసాయశాఖ జేడీకి పంపాలని తెలిపారు. సమీక్షలో జేడీఏ ప్రసాద్, ఎల్‌డీఎం చౌదరి తదితరులు పాల్గొన్నారు.
మాఫీ రూ.1800 కోట్లు!
Published Mon, Sep 1 2014 2:57 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement