ఏం.. తమాషాగా ఉందా..!
- డీసీసీ సమావేశంలో బ్యాంకర్లపై కలెక్టర్ ఆగ్రహం
- రుణ మంజూరులో శ్రద్ధ పెట్టడంలేదని మండిపాటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణ మంజూరుపై బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాల్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెజారిటీ సంఖ్యలో బ్యాంకు కోఆర్డినేటర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత సమావేశంలోనూ గైర్హారయ్యారని గుర్తుచేస్తూ.. వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. అనంతరం కేటగిరీల వారీగా రుణాల పంపిణీ తీరును సమీక్షిస్తూ ప్రత్యేక శ్రద్ద వహించి లక్ష్యాల్సి సాధించాలన్నారు. పంటరుణాల కేటగిరీలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 714 కోట్లకుగాను రూ.664.84 కోట్లు మాత్రమే పంపిణీ చేశామని, మిగతా రుణాల్సి త్వరితంగా మంజూరుచేయాలన్నారు.
జిల్లాలో 15,385 స్వయంసహాయక సంఘాలకు రూ.244.73 కోట్ల లక్ష్యం నిర్దేశిం చగా.. ఇప్పటివరకు 9502 సంఘాలకు రుణాలిచ్చారన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా ప్రతి సంఘానికి రుణం అందించాలన్నారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల పంపిణీ సైతం వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, ఆర్‌బీఐ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు.