ధరల మంట
- ముట్టుకుంటే మండిపోయే కాయగూరలు
- టమాట రూ.80.. మిర్చి రూ.70
- తక్కినవీ రూ.40 పైమాటే..
- అందుబాటులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు
కిలో కాయగూరల ధర(రూపాయల్లో)
టమాట 80
పచ్చి మిర్చి 70
కారెట్ 70
బెండకాయ 40
చిక్కుడు 40
కాకర 40
బీన్స్ 50
గోరు చిక్కుడు 40
వంకాయ 40
బీట్‌రూట్ 40
ఆలుగడ్డ 20
ఉల్లిగడ్డ 20
అనంతపురం అర్బన్:
కాయగూరల పేరు వింటేనే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు వణికిపోతున్నాయి. ఏది ముట్టుకున్నా ధరల మంట ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కూలీ పనులు చేసుకునే బడుగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షగా మారుతోంది. నిత్యం వినియోగించే టమాట, మిర్చి ధర దడ పుట్టిస్తోంది. రోజురోజుకు ధర పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత వారం టమాట కిలో ధర రూ.60 కాగా.. ప్రస్తుతం రూ.80లకు చేరుకుంది. పచ్చి మిర్చి కూడా రూ.70 పలుకుతోంది. ఇక మిగిలిన కాయగూరల ధరలన్నీ రూ.40 పైమాటే కావడంతో మార్కెట్ వైపు చూసేందుకు కూడా ప్రజలు జంకే పరిస్థితి వచ్చింది.
జిల్లాలో సరుకు లేకపోవడంతో..
ప్రస్తుతం జిల్లాలో కాయగూరల సాగు లేదని, మరో నాలుగు నెలల వరకు పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిస్తే కాయగూరల సాగు మొదలై మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి కాయగూరలు దిగమతి అవుతున్నాయని, దీంతో ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు.
సర్దుకుపోతున్నాం
కాయగూరల ధరల విపరీతంగా ఉండడంతో సర్దుకుపోతున్నాం. ఏవీ పావు కిలోకి మించి తీసుకోవట్లేదు. ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మాలాంటి మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలి.
– కృష్ణవేణి, గృహిణి, అశోక్‌నగర్
కొనడం తగ్గించాం
కాయగూరల ధర భయపెడుతోంది. ఇంతకు ముందు మార్కెట్‌కి వెళితే వారానికి సరిపడా కాయగూరలు తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మార్కెట్‌కి వెళ్లడం మానుకుని ఇంటికి దగ్గర్లో అంగడికి వెళ్లి అవసరానికి తగ్గట్టు కొంటున్నాం.
– జయలక్ష్మి, గృహిణి, రాణీనగర్