జువైనల్ కోర్టులో గ్రామ్య సంస్థ ఫిర్యాదు
నల్లగొండ క్రైం : విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. ఉపాధ్యాయుల బోధన తీరును పర్యవేక్షించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు అదే హైస్కూల్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన చందంపేట మండలంలో చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయుడిపై బాధిత విద్యార్థినితోపాటు చందంపేట మండలంలోని గ్రామ్య స్వచ్ఛంద సంస్థ నల్లగొండలోని జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్ నిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. గ్రామ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో విద్యార్థిని స్కూల్‌కు వెళ్లకపోవడంతో తండ్రి శంకర్ బాలికను స్కూల్‌కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా ప్రధానోపాధ్యాయుడు అసభ్య పదజాలంతో వేధింపులకు గురిచేస్తున్నాడని అందుకే వెళ్లడం లేదని తండ్రికి తెలిపింది. ఈ విషయమై తండ్రి చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ సంస్థ తండ్రి, బాలికల వివరాలు సేకరించడంతో పాటు వారి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంది.
ఈ విషయమై గత నెల 7న జేసీ, డీఈఓ, చందంపేట ఎంఈఓకు ఫిర్యాదు చేసింది. వారు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోవడంతో జువైనల్ జస్టిస్ ఆశ్రయించినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ హైస్కూల్‌లో చదివేందుకు బాలిక అంగీకరించకపోవడంతో గ్రామ్య సంస్థ నుంచే బాలికకు విద్యాభ్యాసం చేస్తున్నామని తెలిపారు. గ్రామ్య సంస్థ ఫిర్యాదు మేరకు సంబంధిత హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేశామని స్పందించకపోతే ఎస్పీ ద్వారా నోటీసులు అందజేస్తామని జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్ నిమ్మయ్య ‘సాక్షి’కి తెలిపారు.