భక్తుల సౌకర్యానికే అధిక ప్రాధాన్యత
భక్తుల సౌకర్యానికే అధిక ప్రాధాన్యత
Published Wed, Feb 8 2017 10:42 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- మహాశివరాత్రి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష
శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై దేవస్థానం ఈఓ నారాయణభరత్ గుప్త బుధవారం సాయంత్రం వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా పనుల పురోభివృద్ధిపై చర్చించారు. ముఖ్యంగా భక్తులకు తాత్కాలిక వసతి, మంచినీటి సదుపాయం, సౌకర్యవంతమైన దర్శనం, అన్నదానం, పారిశుద్ద్యం అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు...
బ్రహ్మోత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు నిర్వహించే కార్యక్రమాలు సంప్రదాయ బద్దంగా నిర్వహించాలని సూచించారు.
భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు పాతాళగంగ మార్గంలోని యాత్రిక వసతి సముదాయంలో ఇప్పటికే రెండు షెడ్లను సిద్ధం చేశారు.· మరో షెడ్‌ను కూడా అందుబాటులోకి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందులో లాకర్ సదుపాయం, శుద్ధనీటి సరఫరా, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఉచిత మినరల్‌వాటర్ కేంద్రాలు...
భక్తుల సౌకర్యార్థం గంగాసదన్, కల్యాణకట్ట వద్ద ఉచిత మినరల్ వాటర్ కేంద్రాలను ఏర్పాటు, శివరాత్రిలోగా దేవస్థానం వైద్యశాల, చంద్రవతి కల్యాణ మండపంతో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఈ శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాధులు ప్రబల కుండా జిల్లా యంత్రాంగంతో కలిసి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పార్కింగ్ సౌకర్యం...
వాహనాల పార్కింగ్ కోసం దేవస్థానం యజ్ఞవాటిక, హెలిప్యాడ్, గౌరిసదన్ ప్రక్కన, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, ఫిలిగ్రీమ్ షెడ్ల వెనుక ప్రాంతాన్ని చదును చేసి అవసరమైన ఏర్పాట్లును చేస్తున్నామన్నారు.
విశ్రాంతి గదులు...
క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా కంపార్టుమెంట్లలో వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా మరో 12 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ మొత్తం 17 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయగా, వీటిలో 11 కంపార్టుమెంట్లు ఉచిత దర్శనానికి, 6 కంపార్టుమెంట్లను శీఘ్రదర్శనాన్ని భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.
పాతాళగంగ వద్ద ఏర్పాట్లు...
పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
దీక్షాపరులకు దర్శన ఏర్పాట్లు...
శివదీక్షా భక్తుల దర్శనానికి వేచి ఉండేందుకు చంద్రావతి కల్యాణ మండపంలో అవసరమైన ఏర్పాట్లు చేసి, అక్కడి నుంచి శివాజీపార్క్ మీదుగా ప్రత్యేక క్యూ లైన్ ద్వారా సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా మహాద్వారం నుంచి దర్శనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి శివదీక్షా శిబిరాలలో అన్నప్రసాదాలను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ కార్యక్రమాలన్నింటిని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Advertisement
Advertisement