అస్మదీయులకే భూముల పందేరం!
ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం మాటున భూదందా
మార్గదర్శకాలు ఖరారు కాకుండానే అప్పగింతకు యత్నాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు మాటున ఏపీ ప్రభుత్వం భారీ భూ దందాకు తెరతీస్తోంది. విధివిధానాలు, నియమ నిబంధనలు, నోటిఫికేషన్ వంటివేవీ లేకుండానే భూముల పందేరానికి సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ నేతల సంస్థలకు వేలాది ఎకరాలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ద్వారా జాబితాను ఖరారు చేయించింది. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో విద్యానగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలోనూ ప్రైవేట్ వర్సిటీలు, విద్యా సంస్థలకు అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ విద్యానగరాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం రాయలసీమ, జేఎన్‌టీయూ-కాకినాడ, శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ప్రొ.నర్సింహులు, ప్రొ.వీఎస్‌ఎస్ కుమార్, ప్రొ.రాజగోపాల్‌లతో కమిటీని నియమించింది. ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. మరోవైపు ప్రైవేట్ వర్సిటీల చట్టం అమలుకు విధివిధానాలను కూడా రూపొందించలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఏయే సంస్థలకు భూములు ఇవ్వాలో ముందే జాబితాను సిద్ధం చేయడం గమనార్హం.
భూములపై అధికారం ప్రైవేట్‌కే...
విద్యా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించకుండా విదేశీ వర్సిటీలు నేరుగా దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లేదు. ఆ విదేశీ వర్సిటీల పేరు చెప్పి వాటి భాగస్వామ్యమంటూ వందలాది ఎకరాలను అస్మదీయులు, అధికార పార్టీ నేతల విద్యాసంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారు. కొన్నింటికి నేరుగా, మరికొన్నింటికి ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్లుగా చూపించి భూములు కేటాయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్లు చూపుతున్నా ఒప్పందాల్లో మాత్రం భూములపై పూర్తి అధికారాన్ని ప్రైవేట్ సంస్థలకే అప్పగించనున్నారు.
ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారం సంస్థలు, వాటికి కేటాయించే భూములు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏపీ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అక్వాటిక్ సెన్సైస్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థకు రూ.300 కోట్ల వ్యయం కానుండగా ఇందులో ప్రభుత్వం రూ.153 కోట్లు ఇవ్వనుంది.
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీడర్‌షిప్ అకాడమీ, లా అకాడమీల కోసం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులోని 200 ఎకరాలను ఎంపిక చేశారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే యోగా అండ్ ధ్యాన అనే సంస్థకు 25 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
వెబ్‌సిటీ (వర్చ్యువల్ అకాడమీ) కోసం విజయవాడ లేదా విశాఖపట్నంలలో స్థలాలను పరిశీలిస్తున్నారు.
అమృతా వర్సిటీకి సీఆర్‌డీఏ పరిధిలో 300 ఎకరాలను కేటాయించనున్నారు.
నేచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం కోసం విశాఖలో 30 ఎకరాలు ఖరారు చేస్తున్నారు.
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ కోసం కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో 150 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు.
టీఈఆర్‌ఐ ఎనర్జీ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ కోసం విశాఖ, విజయవాడల్లో 30 ఎకరాలను పరిశీలిస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం అనంతపురంలో 200 ఎకరాలను సిద్ధం చేశారు.
లాజిస్టిక్ యూనివర్సిటీ కోసం 75 ఎకరాలను విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు.
పైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న హాస్పిటాలిటీ యూనివర్సిటీ కోసం 100 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
వైవీఆర్ యూనివర్సిటీ కోసం విశాఖపట్నం సమీపంలో 20 ఎకరాలను సిద్ధం చేశారు.
జీఎమ్మార్ యూనివర్సిటీ కోసం 20 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 200 ఎకరాలు ఇవ్వనున్నారు.
సాఫ్ట్ బ్యాంక్ యూనివర్సిటీకి 500 ఎకరాలు కేటాయించనున్నారు.
సీఐఐ ఆధ్వర్యంలోని నాలెడ్జ్ ఎకానమీ జోన్ కోసం 200 ఎకరాలు ఖరారు చేశారు.