విజేతలకు బహుమతి ప్రదానం
రాజమహేంద్రవరం కల్చరల్ :
తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలో సుమారు 40 పాఠశాలల్లో నిర్వహించినపరిచయ్, ప్రవేశిక ధార్మికవిజ్ఞాన పరీక్షలలో విజేతలకు బుధవారం దానవాయిపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో బహుమతులను అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించినవారికి శ్రీవారి వెండిడాలరుతో పాటు వరుసగా రూ. 1,000, రూ. 750, రూ. 500 నగదుపురస్కారాలను అందజేశారు. ముఖ్య అతిథి, జిల్లా ధర్మప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ బహుమతులు రానివారు నిరుత్సాహపడరాదు, విజేతలు విర్రవీగరాదని హితవు పలికారు. ఆధునికత పేరిట వెర్రి పోకడలు ప్రారంభమయ్యాయని, మన సంస్కృతి మీద దండయాత్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మపరిరక్షణకు టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ధర్మప్రచార మండలి కో–ఆర్డినేటర్ ఎం.సత్యనారాయణ, ప్రోగ్రాం అసిస్టెంట్ ఓరుగంటి నరసింహయోగి, పురాణ పండితుడు వెంపరాల రామకృష్ణ ప్రసాద్, ధర్మప్రచార మండలి సభ్యుడు జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు : పరిచయ్ పరీక్ష: బి. మనీషా (కొత్తలంక– ప్రథమ), ఎం. శ్రుతి (రాజమహేంద్రవరం– ద్వితీయ), జి. అమృత (కాట్రేనికోన– తృతీయ).
ప్రవేశిక పరీక్ష : పి.పావని (బట్టెలంక, మలికిపురం మండలం– ప్రథమ), ఎన్‌ఎస్‌ఎల్‌వీ పావని (మురమళ్ల– ద్వితీయ), ఏఏవీ విజయలక్ష్మి (అంతర్వేది– తృతీయ)