కష్టాలే విజయానికి ఆయుధాలు
– ప్రణాళికతో చదివితే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సులువే
– జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కష్టాలనే విజయానికి ఆయుధాలుగా మలుచుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికష్ణ యువతకు పిలుపునిచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు వాటినే తలుచుకొని కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. సానుకూల దృక్పథంతో తాను సాధించగలననే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విజయం వైపు పరుగులు తీయాలని సూచించారు. ఆదివారం బీఏఎస్ కల్యాణ మండపంలో అమరావతి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని నిరుద్యోగులకు ఉచితంగా గ్రూపు పరీక్షలు, పోలీసు ఉద్యోగాల కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ...ప్రణాళికతో చదివితో పోటీ పరీక్షలలో విజయం సాధించడం సులువని పేర్కొన్నారు. తాను పాఠశాల, కళాశాల, డిగ్రీ స్థాయిల్లో అనేక కష్టాలను ఎదుర్కొని చదువుకున్నానని, తండ్రి ఆశయం కోసం సివిల్స్ పరీక్షను రాసి విజయం సాధించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల కోర్కెలను తీర్చేందుకు కష్టపడి చదవాలని సూచించారు. అంతకముందు హైదరాబాద్ నుంచి వచ్చిన నరసింహులు జిగ్రాఫీపై, అల్డాడి అంజయ్య ఎకానమీ, శివరాజ్ పాలిటిక్స్, పూవ్వాడి రమణ్ హిస్టరీ, భిక్షఫతి కరెంట్ ఆఫైర్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాగా, కర్నూలు విద్యార్థులు పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఇబ్బందులు పడకుండా అక్కడి ఫ్యాకల్టీతోనే కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు డైరక్టర్లు జే.శ్రీరామ్, యాదయ్య పేర్కొన్నారు.