
మంత్రి అచ్చెన్నకు సంబంధాలున్నాయా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/నరసన్నపేట: ఇటీవల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీంకు అధికార టీడీపీ నాయకులకు సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సినీనిర్మాత నట్టికుమార్ ప్రకటన మరింత సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు సెటిల్‌మెంట్లలో, కిరాయి హత్యలతో, బ్లాక్‌మెయిలింగ్ కేసుల్లో నయీం ముఠా హస్తమేమిటనేదీ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యవహారాలే జిల్లాలోనూ చోటుచేసుకున్నాయనేసరికి జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నయీం ముఠా అకృత్యాలపై ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదన్న నట్టి కుమార్... తనకు అన్యాయం జరగడానికి నయీంకు, మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధం ఉండటమే కారణమని మీడియా ముందు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నిర్మాత నట్టి కుమార్ రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమాహాళ్లను గతంలో లీజుకు తీసుకున్నారు. వాటిలో రెండు జిల్లాలోని నరసన్నపేట, నరసన్నపేట, కవిటిలో కూడా ఉన్నాయి. సోమవారం నట్టికుమార్ మంత్రి అచ్చెన్నాయుడిపై చేసిన ఆరోపణల్లో నరసన్నపేట థియేటర్ ప్రస్తావన వచ్చింది. అలా ప్రకటించి కొద్ది గంటల వ్యవధిలోనే ఇంటెలిజెన్స్ పోలీసులు నరసన్నపేటలోని వెంకటేశ్వర యాజమాన్యంతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వెంకటేశ్వర థియేటర్‌ను 12 ఏళ్ల పాటు లీజుకు నట్టికుమార్ తీసుకున్నారు. అయితే కొంతకాలం ఈ వ్యవహారం సజావుగా సాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏడాది క్రితం ఈ లీజు సొమ్ము చెల్లింపు విషయంలో నట్టికుమార్‌కు థియేటర్ యాజమాన్యానికి వివాదాలు తలెత్తాయి.
దీంతో వారి మధ్య సెటిల్‌మెంట్ వ్యవహారంలో నయీం జోక్యం చేసుకున్నాడని నట్టికుమార్ సోమవారం ఆరోపించారు. ఈ సెటిల్‌మెంట్ వ్యవహారం తనకు నష్టం చేకూర్చేలా ఉందని, నయీం గ్యాంగ్ జోక్యం అన్యాయంగా ఉందని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నట్టికుమార్ ఆరోపించారు. అంతేకాదు జిల్లాలోని పోలీసు అధికారుల్లో ఎక్కువ మంది మంత్రి అచ్చెన్నాయుడికి బంధువులేనని, అందువల్లే తనకు న్యాయం జరగలేదని ఆరోపించడం సంచలనమైంది.
నయీం జిల్లాకు వచ్చాడా...?
నయీం జిల్లాకు వచ్చాడా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రెండు నెలల క్రితం నయీం తన ముఠాతో కలిసి శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్‌లో మకాం వేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. దీనిపై హడావుడి నడిచింది. కానీ పోలీసులు తాము ఎందుకు హోటల్‌కు వెళ్లారో, ఎందుకు తనిఖీలు నిర్వహించారో బయటకు పొక్కనీయలేదు. సహజంగా నిర్వహించే తనిఖీలే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఒకవేళ నిజంగా వచ్చింది నయీమే అయితే పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పోలీసుశాఖలో తమకున్న పలుకుబడితో టీడీపీ నాయకులెవ్వరైనా అడ్డుకున్నారా? అనే సంశయం నెలకొంది. ఈ నేపథ్యం లో నట్టికుమార్ నేరుగా జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కోర్టు ద్వారానే తేల్చుకున్నాం
నట్టి కుమార్ ఆరోపణలపై నరసన్నపేటలోని థియేటర్ యజమాని కృష్ణప్రసాద్ స్పందిస్తూ ....నట్టికుమార్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లీజ్‌కు సంబందించి వివాదం కోర్టు ద్వారా చట్ట ప్రకారం సెటిల్‌మెంట్ చేసుకున్నామని చెప్పారు. ఫిలించాంబర్ ప్రతినిధులు కూడా తమ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించారని వెల్లడించారు.