సిరుల పంట
కరువు నేలపై అన్నదాత వినూత్న ప్రయోగం
వరిగల సాగుతో లాభాలు
రూ. 2వేలతో ఎకరా పొలంలో సాగు
రోగులకూ బలవర్ధక ఆహారం
ఒకే రకం పంట సాగుతో వరస నష్టాల చవిచూస్తున్న కరువు జిల్లా రైతులకు వరిగల సాగు లాభాల పంటగా మారుతోంది. సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేపడితే దిగుబడి కూడా అత్యధికంగా వస్తుండడంతో ముదిగుబ్బకు చెందిన రైతు మౌలాలీ ఈసారి తన ఐదెకరాల పొలంలో వరిగల సాగును చేపట్టాడు. వూహించని రీతిలో దిగుబడి రావడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కరువు నేలపై వరిగల సాగు లాభాల వర్షాలను కురిపిస్తుందని అతను నిరూపించాడు.
ఐదెకరాల సాగుకు రూ. 10 వేలు
ముదిగుబ్బకు చెందిన రైతు మౌలాలీకు ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంది. వర్షాధారంపై ఆధారపడి పంట సాగు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే వరుసగా పంట నష్టాలను చవి చూశాడు. ఇలాంటి తరుణంలో వరిగల సాగు గురించి తెలుసుకున్న అతను తొలిసారిగా ధైర్యం చేసి ఐదు ఎకరాల పొలంలో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి విత్తు వేశాడు. అదే సమయంలో అంతరపంటగా కంది సాగు చేపట్టాడు. ఆవు గంజు, పేడ మిశ్రమాన్ని పిచికారి చేస్తూ, చీడపీడల నివారణకు తక్కువ మోతాదులో మందులు వాడాడు. 75 రోజుల తర్వాత పంట చేతికి వచ్చింది. ఐదెకరాల్లో 30 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ రూ. 3,260తో అమ్ముడుపోయింది. ఇది కాక అంతరపంటగా సాగు చేసిన కంది ద్వారా అదనపు ఆదాయం వస్తోంది.
ఆనందంగా ఉంది
మొట్టమొదటి సారి వరిగల పంట సాగు చేశాను. సేంద్రియ ఎరువుల వాడడం వల్ల అధిక దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో వరిగలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ధర కూడా ఎక్కువగా నే ఉంది. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నష్టాల నుంచి గట్టెక్కవచ్చు అని తెలుసుకున్నాను.
– మౌలాలీ, రైతు
మధుమేహ రోగులకు మంచి ఆహారం
మధుమేహ రోగులకు వరిగలు మంచి పౌష్టికాహారం. ఇందులో ఉన్న ప్రత్యేక గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. వరిగల గింజలతో ఉప్మా, ఇడ్లీలు, అన్నం వండుకుని చేసుకుని తినవచ్చు. పలు కంపెనీలు వరిగలతో బిస్కట్‌లు, బ్రెడ్‌లు తయారు చేస్తున్నాయి. ఆరోగ్యపరంగా వరిగల ఉత్పత్తులు తినడం చాలా మంచింది.
– శివశంకర్ నాయక్, వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి
రైతుల్లో అవగాహన పెంచుతాం
సంప్రదాయ వేరుశనగ పంటతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రత్యామ్నాయ పద్దతిలో వరిగలు సాగు చేసేలా రైతుల్లో చైతన్యం తీసుకువస్తాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే పంటల్లో వరిగలు ఒక్కటి. ఈ పంట దిగుబళ్లకు కదిరి, మదనపల్లెల్లో మంచి డిమాండ్ ఉంది.
– మల్లేష్‌కుమార్, వ్యవసాయశాఖాదికారి, ముదిగుబ్బ