mudigubba
-
Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి
సాక్షి, సత్యసాయి జిల్లా(ధర్మవరం): ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చేది. దీంతో ముదిగుబ్బ మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లోని ముదిగుబ్బను సర్కిల్‌గా ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ నెం.132 విడుదల చేసింది. ముదిగుబ్బ సర్కిల్ పరిధిలోకి తాడిమర్రి, ముదిగుబ్బ, పట్నం పోలీస్స్టేషన్లు వస్తాయి. చదవండి: (YSR Kadapa: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే) -
పెళ్లిలో వధువు నెక్లెస్ మాయం.. కాసేపటికే..
సాక్షి, బత్తలపల్లి (అనంతపురం): వివాహ వేడుకలో వధువు మెడలోని నెక్లెస్‌ను పోగొట్టుకుంది. సకాలంలో పోలీసులు స్పందించి నెక్లెస్ స్వాధీనం చేసుకుని అప్పగించారు. వివరాలు.. ధర్మవరం రూరల్ మండలం కుణుతూరుకు చెందిన మీనాక్షి, నారాయణస్వామి దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు... ముదిగుబ్బ మండలం ఉప్పలపాడుకు చెందిన అనంతమ్మ, వెంకట్రాముడు దంపతుల కుమారుడు తిమ్మరాజుతో శనివారం బత్తలపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రంలో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తి అయిన తర్వాత తన మెడలోని సుమారు 2 తులాల బంగారు నెక్లెస్ కనిపించడం లేదని కుటుంబసభ్యులకు పెళ్లి కుమార్తె తెలిపింది. బంధువులు వెదికినా ఫలితం దక్కలేదు. దీంతో సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్ఐ టీవీ శ్రీహర్ష వెంటనే అక్కడకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఇంతలో ఒకరు వచ్చి తమకు నెక్లెస్ దొరికిందంటూ అప్పగించడంతో వివరాలు తెలుసుకుని నెక్లెస్‌ను పెళ్లికుమార్తెకు అప్పగించి, నూతన జంటను ఆశీర్వదించారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. విటులకు ఆహ్వానం..) -
కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..
ముదిగుబ్బ: మనమధ్య వివాదాలు ఎందుకు? కలిసిమెలిసి ఉందాం అని నచ్చజెప్పి భార్యను తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపేణ అతడి భార్యను కబళించింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్లనంతపురం సమీపాన ఆదివారం రోడ్డు పక్కను వున్న కల్వర్టును కారు డీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చింతామణికి చెందిన రమేశ్‌బాబు, రుక్మిణమ్మ భార్యాభర్తలు. వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రుక్మిణమ్మ భర్తతో విబేధించింది. అనంతపురంలోని వారి బంధువుల ఇంటికి వచ్చి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భార్యకు నచ్చచెప్పి తిరిగి కాపురానికి తీసుకెళ్దామని రమేశ్‌బాబు భావించాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య రుక్మిణమ్మ వద్దకు వచ్చి మాట్లాడాడు. భర్త నచ్చచెప్పడంతో తిరిగి కాపురానికి ఆమె అంగీకరించింది. దీంతో అందరూ సంతోషంగా కారులో చింతామణికి బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు రాళ్లనంతపురం వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యింది. రుక్మిణమ్మ, డ్రైవర్ శివన్న (43) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌బాబు, లక్ష్మీదేవి, అభిషేక్ బాబులు తీవ్రంగా గాయపడడంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
ఎంతపని చేశావమ్మా.. ప్రేమా!
రెండు మనసులను కలుపుతుంది.. ప్రేమ. మనుషుల మధ్య దూరం చెరిపేస్తుంది.. ప్రేమ. కులమతాలకు అతీతం.. ప్రేమ. చంపే కొద్దీ పుట్టుకొస్తుంది.. ప్రేమ. ఇంతటి పవిత్రమైన ప్రేమ.. ఓ జంటను పొట్టనపెట్టుకుంది. ఇది హత్యా? ఆత్మహత్యా? అనంతపురం, ముదిగుబ్బ: ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ రైలు పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. కలిసి బతకలేమని భావించి తనువు చాలించారా.. లేక ఎవరైనా వీరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్నది తెలియడం లేదు. ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్రకాలనీకి ఎరికల ఉమాదేవి (21), బోయ మధు (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఉమాదేవి తండ్రి గోపికి తెలిసింది. దీంతో ఆయన తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఉమాదేవి ప్రియునితో కలిసి ఇంటి నుంచి వచ్చేసింది. కులాంతర ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గురువారం రాత్రి ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురం సమీపానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అక్కడే రైలుపట్టాలపై ఉమాదేవి, మధు మృతదేహాలను ట్రాక్మెన్లు గుర్తించారు. మృతిపై అనుమానాలు రైలు పట్టాలపై ప్రేమజంట మృతదేహాలు పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయి ముఖం ఛిద్రం కాగా ఒంటిపై బట్టలు అలానే ఉన్నాయి. అబ్బాయి తల ఒక కాలు, రెండు చేతులు వేరుపడ్డాయి. తల నుజ్జునుజ్జవగా శరీరంపై ఎటువంటి దుస్తులూ లేవు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. -
ముదిగుబ్బ, ధర్మవరంలో భారీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 62 మండలాల పరిధిలో వర్షం కురిసింది. దీంతో ఒకే రోజు 16.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ముదిగుబ్బలో 77 మి.మీ, ధర్మవరంలో 65.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే నార్పలలో 52.8 మి.మీ, తాడిమర్రిలో 47.3 మి.మీ, కనగానపల్లిలో 45.5 మి.మీ, కూడేరులో 37.3 మి.మీ, ఆత్మకూరులో 42.7 మి.మీ, వజ్రకరూరులో 30.2 మి.మీ, శింగనమలలోే 29.8 మి.మీ, పామిడిలో 27.3 మి.మీ, బత్తలపల్లిలో 27.6 మి.మీ, అమడగూరులో 29.9 మి.మీ, మడకశిరలో 33 మి.మీ, లేపాక్షిలో 32.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసింది. ఈ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 61 మి.మీ వర్షపాతం నమోదైంది. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డీబార్
- ప్రారంభమైన డిగ్రీ వార్షిక పరీక్షలు –ఆకస్మికంగా తనిఖీ చేసిన రిజిస్ట్రార్, డీఈ –ఆలస్యంగా ప్రశ్నాపత్రం –ఆందోళన చెందిన విద్యార్థులు ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని 90 డిగ్రీ కళాశాలకు సంబంధించి 58 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను ఎస్కేయూ రిజిస్ట్రార్ కే.సుధాకర్‌బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ రెడ్డివెంకటరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముదిగుబ్బ పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణ, లోటుపాట్లపై ఆరా తీశారు. కదిరి బ్లూమూన్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడుతుండగా డీబార్ చేసినట్లు డైరెక్టర్ రెడ్డివెంటకరాజు తెలిపారు. ఆలస్యంగా అందిన ప్రశ్నపత్రం ప్రశ్నపత్రం ఆలస్యం కావడంతో అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆందోళన చెందారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాలని నిర్ధేశించినప్పటికీ , 9గంటల 45 నిమిషాలకు ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష ప్రారంభం అయింది. ఒక గంట ముందు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్లో ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 7 గంటల 45 నిమిషాలకే వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్ట్స్ కళాశాలకు పాస్‌వర్డ్‌ను మెయిల్ ద్వారా పంపారు. అయితే 1970 మంది విద్యార్థులు ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడంతో ప్రశ్నపత్రాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆలస్యం అయిందని ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ రెడ్డివెంకటరాజు తెలిపారు. శనివారం నుంచి రెండు గంటల ముందు పాస్వర్డ్ ఆర్ట్స్ కళాశాలకు పంపే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ముదిగుబ్బలో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు
ముదిగుబ్బ : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారంముదిగుబ్బ రైల్వే స్టేషన్లో ఆగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలుకు పూలమాల వేసి, కొబ్బరి కాయ కొట్టి పూజలు చేశారు. ముదిగుబ్బలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని సుదీర్ఘకాలంగా మండల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులు స్పందించి నేటి నుంచి ఆరు నెలల పాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపాలని అధికారులు నిర్ణయించారు. రిజర్వేషన్, టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.7 వేలు ఆదాయం ఉంటేనే ఆరు నెలల తర్వాత కూడా రైలు ఆపుతారు, లేకపోతే నిలపరు. ప్రతి ఆది, గురువారాల్లో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉదయం 5:40కు ముదిగుబ్బ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 8:40కు ముదిగుబ్బకు వస్తుంది. కాగా అన్ని ఎక్స్‌ప్రెస్‌రైళ్లను ఆపాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
అరటితోట దగ్ధం..రూ.5 లక్షలు ఆస్తినష్టం
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండల పరిధిలోని దొరిగిల్లులో దివాకర్‌రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి, పూర్తిగా కాలిపోయింది. బాధిత రైతు తహసీల్దార్ పీవీ రమణకు వినతిపత్రం అందజేశాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు పంట నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. పంటను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతుకు హామీ ఇచ్చారు. -
పింఛన్ కోసం వచ్చి రోడ్డుప్రమాదంలో వృద్ధురాలు మృతి
ముదిగుబ్బ : పింఛన్ డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న వృద్ధురాలు ద్విచక్రవాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పూజారితండాకు చెందిన లక్ష్మీబాయి (65) తనకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ బ్యాంకు ఖాతాలో పడిందేమో తెలుసుకుని డ్రా చేసుకోవాలనుకుంది. సోమవారం ఆటోలో ముదిగుబ్బలోని సిండికేట్ బ్యాంకు వద్దకు చేరుకుంది. అక్కడ రద్దీ విపరీతంగా ఉండటంతో పింఛన్ తీసుకోకుండానే బయటకు వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. లక్ష్మీబాయి తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనంలోని ముగ్గురిలో నల్లచెరువు మండలం ఉప్పర్లపల్లికి చెందిన ఇమ్రాన్, అభిమన్యు తీవ్రంగా గాయపడ్డారు. -
ఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ప్యాసెంజర్ రైల్లు ప్రయాణికులతో ఫుల్ – అవస్థలు పడుతున్న ప్రయాణికులు – రైల్వేస్టేషన్‌ను ఉన్నా ఫలితం లేదంటున్న జనం ముదిగుబ్బ : ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉంది.. కానీ రైలు ఎక్కలేని పరిస్థితి. నియోజకవర్గంలో ముదిగుబ్బ అతిపెద్ద మండలం. దాదాపుగా 60వేల జనాభా ఉంది. ముదిగుబ్బ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణించడానికి నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల నుండే కాక పొరుగు జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాలు, జిల్లాలోని బుక్కపట్నం మండలంలోని శివారు ప్రాంత గ్రామాల నుంచి ప్రయాణించడానికి వస్తుంటారు. అయితే ముదిగుబ్బ రైల్వేస్టేషన్ మీదుగా రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ముదిగుబ్బ రైల్వేస్టేషన్లో వేచి ఉంటున్నారు. తీరా రైలు రావడమే ప్రయాణికులతో రద్దీగా వస్తుండటంతో నిలబడటానికి చోటు లేకుండాపోతోంది. గుంతకల్ ప్యాసెంజర్ రైలుకు కేవలం 9 బోగీలు మాత్రమే ఉండగా వాటిలో రెండు బోగీలు రిజర్వేషన్ సౌకర్యం ఉంటాయి. అవి గుంతకల్ అనంతపురం, ధర్మవరం స్టేషన్లకు రాగానే ప్రయాణికులతో బోగీలన్నీ నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత వరకు ప్రయాణిస్తే అంత వరకు ప్రయాణికులు నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది. మరికొంత మంది రైలు డోర్ వద్ద వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్యాసింజర్ రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే వారానికి 4ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముదిగుబ్బ మీదుగా వెళ్తుంటాయి. అయితే రైల్వేస్టేషన్లో స్టాపింగ్ పాయింట్ లేక పోవడంతో ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. కనీసం ఎక్స్‌ప్రెస్ రైళ్లు పద్మావతి, సెవెన్‌హిల్స్, అమరావతి రైళ్లనైనా ముదిగుబ్బలో నిలబడేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. సర్కస్ ఫీట్లు తప్పడం లేదు గుంతకల్ ప్యాసింజర్ రైలు ముదిగుబ్బ చేరుకునే సరికి బోగీలన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి. 5 బోగీలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటంతో రైలులో వెళ్లాలంటే సర్కస్‌ఫీట్లు చేయక తప్పలేదు. – వెంకటనాయుడు, ముదిగుబ్బ బోగీల సంఖ్యను పెంచాలి గుంతకల్ ప్యాసెంజర్ రైలులో బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో ముదిగుబ్బ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు పిల్లలతో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి బోగీల సంఖ్యను పెంచి ప్యాసింజర్ రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలి. – శివానంద, పొడ్రాళ్లపల్లి -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదంలో రంగనాథమ్మ (45) అనే మహిళ మృతి చెందిన ఘటన మడల పరిధిలోని దొరిగిల్లు మలుపు వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. ముదిగుబ్బ మండలం మారాలకు చెందిన చండ్రాయుడు, రంగనాథమ్మలు తన ఆరేళ్ల మనువడితో కలిసి, పులివెందుల వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో మారాల నుంచి బయలు దేరారు. బైక్ మార్గమధ్యంలో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు క్రాస్ వద్ద ఉన్న మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపతప్పి సైడ్వాల్ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు చెల్లా చెదురుగా పడిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన రంగనాథమ్మ, చండ్రాయడులను ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్సచేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగనాథమ్మ మృతి చెందగా ఆమె భర్త చండ్రాయుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఆరేళ్ల మనుమడికి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిరుల పంట
కరువు నేలపై అన్నదాత వినూత్న ప్రయోగం వరిగల సాగుతో లాభాలు రూ. 2వేలతో ఎకరా పొలంలో సాగు రోగులకూ బలవర్ధక ఆహారం ఒకే రకం పంట సాగుతో వరస నష్టాల చవిచూస్తున్న కరువు జిల్లా రైతులకు వరిగల సాగు లాభాల పంటగా మారుతోంది. సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేపడితే దిగుబడి కూడా అత్యధికంగా వస్తుండడంతో ముదిగుబ్బకు చెందిన రైతు మౌలాలీ ఈసారి తన ఐదెకరాల పొలంలో వరిగల సాగును చేపట్టాడు. వూహించని రీతిలో దిగుబడి రావడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కరువు నేలపై వరిగల సాగు లాభాల వర్షాలను కురిపిస్తుందని అతను నిరూపించాడు. ఐదెకరాల సాగుకు రూ. 10 వేలు ముదిగుబ్బకు చెందిన రైతు మౌలాలీకు ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంది. వర్షాధారంపై ఆధారపడి పంట సాగు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే వరుసగా పంట నష్టాలను చవి చూశాడు. ఇలాంటి తరుణంలో వరిగల సాగు గురించి తెలుసుకున్న అతను తొలిసారిగా ధైర్యం చేసి ఐదు ఎకరాల పొలంలో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి విత్తు వేశాడు. అదే సమయంలో అంతరపంటగా కంది సాగు చేపట్టాడు. ఆవు గంజు, పేడ మిశ్రమాన్ని పిచికారి చేస్తూ, చీడపీడల నివారణకు తక్కువ మోతాదులో మందులు వాడాడు. 75 రోజుల తర్వాత పంట చేతికి వచ్చింది. ఐదెకరాల్లో 30 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ రూ. 3,260తో అమ్ముడుపోయింది. ఇది కాక అంతరపంటగా సాగు చేసిన కంది ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. ఆనందంగా ఉంది మొట్టమొదటి సారి వరిగల పంట సాగు చేశాను. సేంద్రియ ఎరువుల వాడడం వల్ల అధిక దిగుబడి వచ్చింది. మార్కెట్లో వరిగలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ధర కూడా ఎక్కువగా నే ఉంది. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నష్టాల నుంచి గట్టెక్కవచ్చు అని తెలుసుకున్నాను. – మౌలాలీ, రైతు మధుమేహ రోగులకు మంచి ఆహారం మధుమేహ రోగులకు వరిగలు మంచి పౌష్టికాహారం. ఇందులో ఉన్న ప్రత్యేక గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. వరిగల గింజలతో ఉప్మా, ఇడ్లీలు, అన్నం వండుకుని చేసుకుని తినవచ్చు. పలు కంపెనీలు వరిగలతో బిస్కట్లు, బ్రెడ్లు తయారు చేస్తున్నాయి. ఆరోగ్యపరంగా వరిగల ఉత్పత్తులు తినడం చాలా మంచింది. – శివశంకర్ నాయక్, వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి రైతుల్లో అవగాహన పెంచుతాం సంప్రదాయ వేరుశనగ పంటతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రత్యామ్నాయ పద్దతిలో వరిగలు సాగు చేసేలా రైతుల్లో చైతన్యం తీసుకువస్తాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే పంటల్లో వరిగలు ఒక్కటి. ఈ పంట దిగుబళ్లకు కదిరి, మదనపల్లెల్లో మంచి డిమాండ్ ఉంది. – మల్లేష్‌కుమార్, వ్యవసాయశాఖాదికారి, ముదిగుబ్బ -
నత్తకు ముత్తాతలు
ముదిగుబ్బలో మూడేళ్లగా సాగుతున్న తాగునీటి పథకం పనులు – రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. 120 గ్రామాలకు చుక్కనీరు అందని వైనం ధర్మవరం/ముదిగుబ్బ: ప్రాజెక్ట్ పేరు : సమగ్ర మంచినీటి పథకం (ముదిగుబ్బ మండలం) లక్ష్యం: ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రజలకు ఉపయోగం : సుమారు 90,000 మందికి పనులు జరగనప్పుడు ఆశయం ఎంత మంచిదైతే మాత్రం ఫలితమేముంటుంది..? ముదిగుబ్బ మండలంలో వేలాది మంది ప్రజలు దాహం కేకలు పెడుతున్నా కాంట్రాక్టర్లు, అధికారులకు చెవికెక్కడం లేదు. 86 గ్రామాలకు మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులు మూడేళ్లుగా నత్తనడకన జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. కాంట్రాక్టర్‌కు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నా పనులెందుకు పూర్తి కావడంలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చేవారు కరువయ్యారు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2013 జూలై 30న ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో రూ. 21.40 కోట్లతో బహత్తర పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులకు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లోని 120 గ్రామాలకు 2014 నవంబర్ నాటికి మంచినీటిని అందివ్వాలన్నది లక్ష్యం. దీని కోసం జాతీయ గ్రామీణ మంచినీటి అభివద్ధి పథకం (ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ) కింద రూ. 21.40 కోట్ల కేంద్రం నిధులు మంజూరయ్యాయి. తొలివిడతగా రూ. 7 కోట్లు, మలివిడతగా మరో రూ. 14 కోట్లు ఇచ్చేలా టెండర్ ఖరారు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సత్యసాయి వాటర్ సప్లై స్కీంద్వారా ఈ ప్లాంటకు వచ్చిన నీటిని శుద్ధిచేసి, రోజుకు 30 మిలియన్ లీటర్ల శుద్ధజలాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలకు అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. అయితే ఆ పనులు పూర్తికాకపోవడంతో 120 గ్రామాలకు నేటికీ చుక్కనీటిని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గడువు ముగిసినా కదలికేదీ వాస్తవానికి గతేడాది సెప్టెంబర్ నాటికే కాంట్రాక్టర్ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరగటంతో కాలపరిమితిని పెంచారు. ప్రాజెక్ట్ పనుల్లో బాగంగా మొదటి విడతలో ప్లాంట్, రెండో విడత కింద గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. తొలిదశలో పనులు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా మలి దశపనుల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ పనులు జాప్యం చేస్తున్నారు. 2014 సెప్టెంబర్ 7న రెండో దశ పనులు ప్రారంభమయితే.. సంపులు ఇంకా ఫిల్లర్ల (పునాది) దశలోనే ఉన్నాయి. ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేందుకు దాదాపు మరో నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం వచ్చే వేసవికైనా మంచినీరు తాగగలమా? లేదా? అని మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల్లో నీళ్లు ఇస్తాం సంపుల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు సేకరించడంలో జాప్యం జరిగింది. సంప్ నిర్మాణం చేసే స్థలం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, మా సంస్థపేరిట రిజిస్ట్రేషన్ చేసిన తరువాత పనులు ప్రారంభించారు. పైపులైన్ల పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇక మిగిలింది సంప్ నిర్మాణం ఒక్కటే .. దాదాపు టాప్ లెవల్‌కు వచ్చింది. త్వరలోనే పూర్తవుతుంది. ఏది ఏమైనా రెండు నెలల్లో శుద్ధి జలాలను ఆయా గ్రామాల ప్రజలకు సరఫరా చేస్తాం. – రాజశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ -
అనంతలో ఘోర రోడ్డుప్రమాదం: ఐదుగురి మృతి
-
వృద్ధురాలి ఆత్మహత్య
నాగలగుబ్బలకు చెందిన సంజీవప్ప భార్య గుర్రమ్మ (64) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అపస్మారకస్థితిలో పడి ఉన్న గుర్రమ్మను బంధువులు గుర్తించి ముది గు బ్బ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. మృ తురాలికి కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
ముదిగుబ్బ, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వైఎస్సార్ సీపీ నేత, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మండలంలోని పులివెందుల రోడ్డు నుంచి నక్కలపల్లి వరకు రూ. 77.25 లక్షల పీఎంజీఎస్‌వై నిధులతో తారురోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే శిలా ఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు పథకంతో అన్ని గ్రామాలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. మండలంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. తమ హయాంలో చిన్నకోట్ల గ్రామానికి రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. మండల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు రూ. 14.50 కోట్ల వ్యయంతో సత్యసాయి తాగునీటి పథకం పనులు పూర్తయ్యాయని, త్వరలో దీన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. నక్కలపల్లికి కూడా సత్యసాయి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తోనే సమైక్యాంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. కార్యక్రమంలో ధర్మవరం మార్కెట్ యార్డు చైర్మన్ రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి, దొరిగిల్లు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.