
రెండు మనసులను కలుపుతుంది.. ప్రేమ. మనుషుల మధ్య దూరం చెరిపేస్తుంది.. ప్రేమ. కులమతాలకు అతీతం.. ప్రేమ. చంపే కొద్దీ పుట్టుకొస్తుంది.. ప్రేమ. ఇంతటి పవిత్రమైన ప్రేమ.. ఓ జంటను పొట్టనపెట్టుకుంది. ఇది హత్యా? ఆత్మహత్యా?
అనంతపురం, ముదిగుబ్బ: ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ రైలు పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. కలిసి బతకలేమని భావించి తనువు చాలించారా.. లేక ఎవరైనా వీరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్నది తెలియడం లేదు. ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్రకాలనీకి ఎరికల ఉమాదేవి (21), బోయ మధు (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఉమాదేవి తండ్రి గోపికి తెలిసింది. దీంతో ఆయన తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఉమాదేవి ప్రియునితో కలిసి ఇంటి నుంచి వచ్చేసింది. కులాంతర ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గురువారం రాత్రి ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురం సమీపానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అక్కడే రైలుపట్టాలపై ఉమాదేవి, మధు మృతదేహాలను ట్రాక్‌మెన్లు గుర్తించారు.
మృతిపై అనుమానాలు
రైలు పట్టాలపై ప్రేమజంట మృతదేహాలు పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయి ముఖం ఛిద్రం కాగా ఒంటిపై బట్టలు అలానే ఉన్నాయి. అబ్బాయి తల ఒక కాలు, రెండు చేతులు వేరుపడ్డాయి. తల నుజ్జునుజ్జవగా శరీరంపై ఎటువంటి దుస్తులూ లేవు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment