డిగ్రీ పరీక్షల్లో ఒకరు డీబార్
- ప్రారంభమైన డిగ్రీ వార్షిక పరీక్షలు
–ఆకస్మికంగా తనిఖీ చేసిన రిజిస్ట్రార్, డీఈ
–ఆలస్యంగా ప్రశ్నాపత్రం
–ఆందోళన చెందిన విద్యార్థులు
ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని 90 డిగ్రీ కళాశాలకు సంబంధించి 58 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను ఎస్కేయూ రిజిస్ట్రార్ కే.సుధాకర్‌బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ రెడ్డివెంకటరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముదిగుబ్బ పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణ, లోటుపాట్లపై ఆరా తీశారు. కదిరి బ్లూమూన్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడుతుండగా డీబార్ చేసినట్లు డైరెక్టర్ రెడ్డివెంటకరాజు తెలిపారు.
ఆలస్యంగా అందిన ప్రశ్నపత్రం
ప్రశ్నపత్రం ఆలస్యం కావడంతో అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆందోళన చెందారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాలని నిర్ధేశించినప్పటికీ , 9గంటల 45 నిమిషాలకు ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష ప్రారంభం అయింది. ఒక గంట ముందు ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 7 గంటల 45 నిమిషాలకే వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్ట్స్ కళాశాలకు పాస్‌వర్డ్‌ను మెయిల్ ద్వారా పంపారు. అయితే 1970 మంది విద్యార్థులు ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడంతో ప్రశ్నపత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆలస్యం అయిందని ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ రెడ్డివెంకటరాజు తెలిపారు. శనివారం నుంచి రెండు గంటల ముందు పాస్‌వర్డ్ ఆర్ట్స్ కళాశాలకు పంపే వెసులుబాటు కల్పిస్తామన్నారు.