నత్తకు ముత్తాతలు
ముదిగుబ్బలో మూడేళ్లగా సాగుతున్న తాగునీటి పథకం పనులు
– రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. 120 గ్రామాలకు చుక్కనీరు అందని వైనం
ధర్మవరం/ముదిగుబ్బ:
ప్రాజెక్ట్ పేరు : సమగ్ర మంచినీటి పథకం (ముదిగుబ్బ మండలం)
లక్ష్యం: ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా
ప్రజలకు ఉపయోగం : సుమారు 90,000 మందికి
పనులు జరగనప్పుడు ఆశయం ఎంత మంచిదైతే మాత్రం ఫలితమేముంటుంది..? ముదిగుబ్బ మండలంలో వేలాది మంది ప్రజలు దాహం కేకలు పెడుతున్నా కాంట్రాక్టర్లు, అధికారులకు చెవికెక్కడం లేదు. 86 గ్రామాలకు మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులు మూడేళ్లుగా నత్తనడకన జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. కాంట్రాక్టర్‌కు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నా పనులెందుకు పూర్తి కావడంలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చేవారు కరువయ్యారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం 2013 జూలై 30న ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో రూ. 21.40 కోట్లతో బహత్తర పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులకు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లోని 120 గ్రామాలకు 2014 నవంబర్ నాటికి మంచినీటిని అందివ్వాలన్నది లక్ష్యం. దీని కోసం జాతీయ గ్రామీణ మంచినీటి అభివద్ధి పథకం (ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ) కింద రూ. 21.40 కోట్ల కేంద్రం నిధులు మంజూరయ్యాయి. తొలివిడతగా రూ. 7 కోట్లు, మలివిడతగా మరో రూ. 14 కోట్లు ఇచ్చేలా టెండర్ ఖరారు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సత్యసాయి వాటర్ సప్లై స్కీంద్వారా ఈ ప్లాంటకు వచ్చిన నీటిని శుద్ధిచేసి, రోజుకు 30 మిలియన్ లీటర్ల శుద్ధజలాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలకు అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. అయితే ఆ పనులు పూర్తికాకపోవడంతో 120 గ్రామాలకు నేటికీ చుక్కనీటిని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గడువు ముగిసినా కదలికేదీ
వాస్తవానికి గతేడాది సెప్టెంబర్ నాటికే కాంట్రాక్టర్ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరగటంతో కాలపరిమితిని పెంచారు. ప్రాజెక్ట్ పనుల్లో బాగంగా మొదటి విడతలో ప్లాంట్, రెండో విడత కింద గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. తొలిదశలో పనులు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా మలి దశపనుల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ పనులు జాప్యం చేస్తున్నారు. 2014 సెప్టెంబర్ 7న రెండో దశ పనులు ప్రారంభమయితే.. సంపులు ఇంకా ఫిల్లర్ల (పునాది) దశలోనే ఉన్నాయి. ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేందుకు దాదాపు మరో నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం వచ్చే వేసవికైనా మంచినీరు తాగగలమా? లేదా? అని మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
రెండు నెలల్లో నీళ్లు ఇస్తాం
సంపుల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు సేకరించడంలో జాప్యం జరిగింది. సంప్ నిర్మాణం చేసే స్థలం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, మా సంస్థపేరిట రిజిస్ట్రేషన్ చేసిన తరువాత పనులు ప్రారంభించారు. పైపులైన్ల పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇక మిగిలింది సంప్ నిర్మాణం ఒక్కటే .. దాదాపు టాప్ లెవల్‌కు వచ్చింది. త్వరలోనే పూర్తవుతుంది. ఏది ఏమైనా రెండు నెలల్లో శుద్ధి జలాలను ఆయా గ్రామాల ప్రజలకు సరఫరా చేస్తాం.
– రాజశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ