మొక్కలను సంరక్షించాలి
-
అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోండి
-
హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
-
అధికారులతో కలెక్టర్ సమీక్ష
ఇందూరు : నాటిన ప్రతి మొక్కను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యోగితా రాణా మండల స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణకు హరితహారంపై సంబంధిత అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పూర్తి స్థాయిలో నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి 800 మొక్కలను సంరక్షించడానికి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. మైక్రోప్లాన్ ద్వారా ఒక్కో కుటుంబానికి 800 మొక్కలను సంరక్షించడానికి కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో భాగంగా గ్యాప్ ఉన్నచోట వాటిని పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఇన్‌చార్జి డ్వామా పీడీ సునంద, డీఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
ఇందూరు : విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ యోగితా రాణా డ్వామా అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరును పరిశీలించారు. పని తక్కువగా ఉన్న సిబ్బందికి పనులను కేటాయించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి నమోదు చేయాలని, ఇందుకు టీంలుగా విడిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అంచనాలను వాస్తవానికి అనుగుణంగా సిద్ధం చేయాలని సూచించారు. విధులపై సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం చేస్తే చర్యలు తప్పవని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి డ్వామా పీడీ సునంద, విజిలెన్స్ అధికారి శ్రీహరి, అధికారులున్నారు.