వైఎస్సార్‌సీపీ నేతలకు రక్షణ కల్పించండి
- రివాల్వర్ లైసెన్సును ఎందుకు రెన్యూవల్ చేయరు?
– పోలీసులు ఏకపక్ష ధోరణి వీడాలి
– గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి
గుంతకల్లు టౌన్ : ప్రానహాని ఉన్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలకు రక్షణ కల్పించాలని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి జిల్లా పోలీసు అధికారులను కోరారు. మంగళవారం ఆయన గుంతకల్లులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన రివాల్వర్ లైసెన్సు (120/1–జి) గడువు 2016 డిసెంబర్ 31కు ముగిసిందన్నారు. లైసెన్స్ రెన్యూవల్ కోసం గడువుకు 25 రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నానన్నారు. నేటివరకూ రెన్యూవల్ చేయకపోగా.. లైసెన్స్ గడువు ముగిసినందున రివాల్వర్‌ను దగ్గర ఉంచుకోవడం చట్టరీత్యా నేరమని, పోలీస్ స్టేసన్‌లో డిపాజిట్ చేయాలని నాలుగు రోజుల క్రితం వజ్రకరూర్ ఎస్‌ఐ తనకు నోటీసులు పంపడమేంటని ఆయన ప్రశ్నించారు.
రెన్యూవల్ పీరియడ్‌లో రివాల్వర్‌ను స్వాధీనపరచాలని ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు కానీ, మార్గదర్శకాలు కానీ జారీ చేయని అధికారులు ఉన్నపళంగా రివాల్వర్‌ను స్వాధీనపరచమని నోటీసులు పంపడంపై అనుమానాలు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల రివ్వాలర్ లైసెన్సులు మాత్రమే రెన్యూవల్ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సబబని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాణహాని ఉన్న ప్రతి ఒక్క టీడీపీ నేతకూ, వారి కుటుంబ సభ్యులకూ రక్షణ కల్పించారని గుర్తు చేశారు. పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో రివాల్వర్‌ను తీసుకెళ్లమని చెప్పినా ఆయనే తీసుకుపోలేదని వ్యాఖ్యానించిన పోలీసు ఉన్నతాధికారులు.. తాము దరఖాస్తు చేసుకున్నా రెన్యూవల్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏకపక్ష ధోరణి వీడి రివాల్వర్ లైసెన్సులు రెన్యూవల్ చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ ముఖ్యనేతలందరికీ రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. లేనిపక్షంలో తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బి.సుంకప్ప, కౌన్సిలర్ అహ్మద్‌బాషా, యువజన విభాగం నేత శరణబసిరెడ్డి పాల్గొన్నారు.