అడవిపందుల దాడిలో ధ్వంసమైన మొక్కజొన్న
- తీవ్రంగా నష్ట పోతున్న రైతన్నలు
- వర్షాలతో తల్లడిల్లుతున్న అన్నదాతలు
- పందుల దాడితో కుంగిపోతున్న వైనం
- పంటలను ధ్వసం చేస్తున్న పందులు
మెదక్ రూరల్: అసలే కరువుతో వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతుంటే....మరోవైపు అడవి పందులు దాడిచేసి పంటలను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయని మెదక్ మండలంలోని ఆయా గ్రామాల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా వర్షాలు లేక తీవ్రకరువు పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో గ్రామాల్లో బతుకు దెరువు కరువై అన్నదాతలు పొట్టచేతబట్టుకొని పట్టణాలకు వలస వెళ్లి కూలీలుగా మారారు. కాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో ఈసారైన వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయని ఆశపడి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక అన్నదాతలు ఆరుతడి పంటలైన మొక్కజొన్న పంటలు వేసుకున్నారు.
అయినప్పటికీ కొంతమంది అన్నదాతలు ఆరుతడి పంటలు వేసుకున్నారు. మెదక్ మండలంలోని జక్కన్నపేట, వాడి, బూర్గుపల్లి, చౌట్లపల్లి, బ్యాతోల్ తదితర గ్రామాల రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న పంట వేసుకున్నారు. అడపా దడపా కురిసిన వర్షాలతో ప్రస్తుతం పంట కంకిదశలో ఉంది. రైతులు చేళ్లవద్దే రాత్రింభవళ్లు పడిగాపులు పడుతూ పంటను కంటి రెప్పల కాపాడుకుంటున్నారు.
ఇదే క్రమంలో పొలాలకు అటవీ సమీపంలో ఉండటం వల్ల అడవి పందులు పంటలపై దాడిచేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అడ్డుకుంటే రైతులపై సైతం దాడులకు పాల్పడుతున్నాయి. అసలే కరువుతో అల్లాడిపోతుంటే అడవి పందులు చేతికొచ్చిన పంటను నేలపాలు చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మెదక్ మండలం జక్కన్నపేట గ్రామానికి చెందిన కౌలురైతు శీలదుర్గయ్య అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి పొలంను కౌలుకు తీసుకొని రెండెకరాలల్లో మొక్కజొన్న పంట సాగుచేశాడు. కాగా శుక్రవారం రాత్రి అడవి పందులు గుంపులుగా వచ్చి పంటను ధ్వంసం చేశాయి. అడ్డుకున్న రైతు దుర్గయ్యపై దాడిచేసి గాయపర్చాయి.
అడవి పందుల దాడిలో సగం మొక్కజొన్న ధ్వంసమైనట్లు బాధితుడు వాపోయాడు. అలాగే అడవి పందుల దాడిలో చేతులకు గాయాలైనట్లు తెలిపారు. పంటసాగుకు రూ.30వేల ఖర్చు అయ్యిందని, అప్పులుచేసి పంట సాగుచేస్తే అడవిపందులు దాడిచేసి రోడ్డుపాలు చేశాయని వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన ఓరైతు పంట పొలాన్నిసైతం అడవి పందులు దాడిచేసి ధ్వంసం చేశాయి.